దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ కాల్పులలో దద్దరిల్లింది. ఓ బార్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మరి కొంత మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి సోవెటో టౌన్‌షిప్‌లో కొందరు వ్యక్తులు మినీ ట్యాక్సీలో బార్ దగ్గరకు వచ్చారు. అక్కడ పార్టీలో మునిగి తేలుతున్న వారిపై విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో బార్‌లోని వ్యక్తులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ బార్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇవాళ ఉదయం మృతదేహాలను వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. ఘటనా స్థలంలో లభించిన తుపాకీ గుళ్ల ఆధారంగా ఓ గ్యాంగ్ సామూహిక కాల్పులకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బార్‌లో నిందితులు ర్యాండమ్ షూటింగ్‌కు పాల్పడ్డారు. అయితే నిందితుల ఉద్దేశ్యం ఏంటి?. వారు కాల్పులు ఎందుకు చేశారనే విషయం ఇంకా తెలియలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.