Pakistan : ఉచితంగా గోధుమ పిండి.. ఎగబడిన జనం.. 11 మంది మృతి
ఉచితంగా గోధమ పిండి పంపిణీ చేస్తున్న కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది మరణించారు
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 5:51 AM GMTగోధుమ పిండి పంపిణీ కేంద్రాల వద్ద ఎగబడిన జనం
పాకిస్థాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ద్రవ్యోల్భణం పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులు తమ కనీస అవసరాలను తీర్చుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రంజాన్ మాసం కావడంతో ప్రజలకు ధరాబారం నుంచి కొద్దిగానైనా ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా గోధమ పిండి పంపిణీని చేపట్టింది.
ఈ గోధుమ పిండిని తీసుకునేందుకు పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 11 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని సహివాల్, బహవాల్‌పూర్, ముజఫర్‌గఢ్, ఒఖారా ప్రాంతాలపోటు, ఫైసలాబాద్, జెహానియాన్, ముల్తాన్ జిల్లాల్లో తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. మంగళవారం ముగ్గురు చనిపోయారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. ఇప్పటి వరకు 11 మంది మరణించగా 60 మందికిపైగా గాయపడ్డారు.
పంపిణీ కేంద్రాలు తక్కువగా ఉండటం, నిర్ణీత సమయంలోనే పంపిణీ చేస్తుండటంతో పిండిని దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంపిణీ కేంద్రం వద్దకు రాకముందే స్థానికులు లారీని దోచుకెళ్తున్నారు.
ఇదిలా ఉండగా రద్దీని, పౌరులకు అసౌకర్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రావిన్స్‌లో ఉదయం 6:00 గంటలకు ఉచిత పిండి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు పంజాబ్ కేర్‌టేకర్ ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.