ఆర్మేనియా రాజధాని యెరవాస్‌లో బాణా సంచా గిడ్డంలో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 62 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది.
రెండు సార్లు పేలుడు శబ్ధాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో పాటు దట్టమైన పొగ ఏర్పడడంతో సహాయక చర్యలకు కొంత ప్రతీకూలంగా అక్కడి పరిస్థితి ఏర్పడింది. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు చాలా సమయం పట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వరకు 11 మృతదేహాలను వెలికి తీసినట్లు అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా.. పేలుడుకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో భవనం పూర్తిగా పొగలు కమ్ముకోని కనిపిస్తోంది. ప్రజలు ఆప్రాంతం నుంచి దూరంగా పారిపోతున్నతున్న దృశ్యాలు కనిపించాయి.