ఉగాండా దేశంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అంధుల పాఠశాలలో మంటలు చెలరేగడంతో కనీసం పదకొండు మంది పిల్లలు మరణించారని పోలీసులు మంగళవారం తెలిపారు. మంటలు చెలరేగడంతో ఆరుగురు విద్యార్థులు కూడా గాయపడ్డారు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముకోనో జిల్లాలోని సలామా అంధుల పాఠశాలలో స్థానిక కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 1 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. అయితే మంటలు చెలరేగడానికి గల కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడిన విద్యార్థులు హెరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
"అగ్నిప్రమాదానికి కారణం ప్రస్తుతం తెలియదు, అయితే అగ్నిప్రమాదం కారణంగా ఇప్పటివరకు 11 మరణాలు నిర్ధారించబడ్డాయి, ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. కిసోగాలోని హెరోనా ఆసుపత్రిలో చేరారు" అని పోలీసులు తెలిపారు. ఉగాండాలో ఘోరమైన అగ్నిప్రమాదాలు చాలా సాధారణం. వైరింగ్ లోపభూయిష్టంగా ఉండటం వల్ల ఈ సంఘటనలు తరచుగా జరుగుతాయి. అయితే కొన్నిసార్లు వసతి గృహాలలో నివసించే పిల్లలు రాత్రి లైట్లు ఆపివేసిన తర్వాత వారి కొవ్వొత్తులను వెలిగించినప్పుడు మంటలు చెలరేగుతాయి.