ఆస్ప‌త్రికి స‌మీపంలో పేలిన గ్యాస్ ట్యాంక‌ర్‌.. 10 మంది మృతి

10 Killed massive fuel tanker explosion in South Africa.దక్షిణాఫ్రికా దేశంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2022 9:12 AM IST
ఆస్ప‌త్రికి స‌మీపంలో పేలిన గ్యాస్ ట్యాంక‌ర్‌.. 10 మంది మృతి

దక్షిణాఫ్రికా దేశంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. గ్యాస్ టాంక‌ర్ పేలి 10 మంది మ‌ర‌ణించారు. మ‌రో 40 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్‌లోని టాంబో మెమోరియల్ హాస్పిటల్ సమీపంలో శనివారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

టాంబో మెమోరియల్ హాస్పిటల్‌కి 100 మీట‌ర్ల దూరంలో ఎత్తు త‌క్కువ‌గా ఉన్న ఓ వంతెన కింద లిక్విడ్ పెట్రోలియం గ్యాస్‌తో వెళ్తున్న ఇంధన ట్యాంకర్ ఇరుక్కుపోయింది. అక్క‌డ ఏర్ప‌డిన ఘ‌ర్ష‌ణ కార‌ణంగా అది పేలిపోయింది. పేలుడు ధాటికి ఆస్ప‌త్రి పై క‌ప్పు కొంత భాగం కూలిపోయింది. ప‌క్క‌న ఉన్న రెండు ఇళ్లు దెబ్బ‌తిన్నాయి. పెద్ద ఎత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి.

స‌మాచారం అందుకున్న వెంట‌నే రెస్య్కూ సిబ్బంది అక్క‌డ‌కు చేరుకున్నారు. మంట‌లు ఆర్పుతున్న క్ర‌మంలో రెండ‌వ పేలుడు సంభ‌వించింది. అగ్నిమాప‌క వాహ‌నం, రెండు బైక్‌లు కాలి బూడిద అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో ఘ‌ట‌నాస్థ‌లంలోనే తొమ్మిది మంది చ‌నిపోయారు. 40 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. వీరిని స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఓ వ్య‌క్తి మ‌ర‌ణించారు. దీంతో ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 10కి చేరింది. గాయ‌ప‌డిన వారిలో 19 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

టాంబో మెమోరియల్ హాస్పిటల్‌లో ఉన్న రోగుల‌ను వెంట‌నే మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పేలుడు జ‌రిగిన స‌మ‌యంలో ట్యాంకర్‌లో 60 వేల లీటర్ల ఎల్పీజీ గ్యాస్‌ ఉందని అధికారులు తెలిపారు. శ‌నివారం ఉదయం 6.30 గంటల సమయంలో ప్రమాదం జరగడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందన్నారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story