ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో కాల్పులు..10 మంది మృతి
ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాండీ బీచ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
By - Knakam Karthik |
ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో కాల్పులు..10 మంది మృతి
ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాండీ బీచ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం అక్కడ జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ముసుగు ధరించిన దుండగులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో పదిమందికిపైగా పర్యాటకులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
బీచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటకులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
దుండగులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఒక దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా కార్డన్ చేసి, భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ దాడికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది ఉగ్రదాడియా? లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా, బాండీ బీచ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. ఈ కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.