ఐర్లాండ్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి ఎన్నిక

Indian-origin Leo Varadkar elected as new PM of Ireland. డబ్లిన్: ఐర్లాండ్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్ అనంతరం ఐర్లాండ్ కొత్త ప్రధానిగా ఐర్లాండ్

By అంజి  Published on  18 Dec 2022 12:06 PM IST
ఐర్లాండ్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి ఎన్నిక

డబ్లిన్: ఐర్లాండ్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్ అనంతరం ఐర్లాండ్ కొత్త ప్రధానిగా ఐర్లాండ్ మాజీ డిప్యూటీ ప్రధాని, ఫైన్ గేల్ పార్టీ నాయకుడు, భారత సంతతికి చెందిన లియో వరద్కర్ ఎన్నికయ్యారు. శనివారం, హౌస్‌లోని మొత్తం 87 మంది సభ్యులు కొత్త ప్రధానిగా ఆయన నామినేషన్‌కు అనుకూలంగా ఓటు వేయగా, 62 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ఐరిష్ ప్రెసిడెంట్ మైఖేల్ డి. హిగ్గిన్స్ అతనిని కొత్త ప్రధానమంత్రిగా నియమించిన తరువాత, లియో వరద్కర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను ప్రకటించారు.

లియో వరద్కర్‌ తండ్రి డాక్టర్‌. భారత్‌లో పుట్టి ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు. వరద్కర్‌ తల్లి ఐర్లాండ్‌ దేశస్తురాలు, ఆమె నర్సుగా పని చేశారు. ఐర్లాండ్‌లోనే జన్మించిన లియో వరద్కర్‌.. వైద్య విద్యను పూర్తి చేసి రాజకీయాల్లో అడుగుపెట్టారు.

వరద్కర్‌.. ఐర్లాండ్‌ ప్రధానమంత్రిగా 2017లో మొదటి బాధ్యతలు చేపట్టగా, ఇప్పుడు రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు. ఐర్లాండ్‌లో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారం పంచుకుంటున్నాయి. కూటమిలో ముందే జరిగిన ఒప్పందం ప్రకారం.. ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న మైకెల్‌ మార్టిన్‌ తన పదవికి రాజీనామా చేసి ప్రధాని బాధ్యతలను వరద్కర్‌కు అప్పగించారు. నామినేషన్‌ను ఐరిష్ పార్లమెంటు దిగువ సభ ఆమోదించిన తర్వాత, కొత్త మంత్రివర్గం శనివారం రాత్రి తన మొదటి సమావేశాన్ని నిర్వహించింది.

మంత్రివర్గంలో మొత్తం 15 మంది సభ్యులున్నారు. ఇతర మంత్రివర్గ సభ్యులకు ఉన్న అన్ని పదవులు అలాగే ఉన్నాయి. క్యాబినెట్ సభ్యుల జాబితా ప్రకారం.. మాజీ ఐరిష్ ప్రధాన మంత్రి, ఫియానా ఫెయిల్ నాయకుడు మైఖేల్ మార్టిన్ కొత్త ఉప ప్రధాన మంత్రి, విదేశీ వ్యవహారాలు, రక్షణ మంత్రి అవుతారు. మాజీ విదేశాంగ, రక్షణ మంత్రి సైమన్ కోవెనీ.. వాణిజ్యం, ఉపాధి శాఖ మంత్రి అవుతారు. మాజీ ఆర్థిక మంత్రి పాస్చల్ డోనోహో ప్రభుత్వ వ్యయం, సంస్కరణల మంత్రిగా ఉంటారు. పబ్లిక్ వ్యయం, సంస్కరణల మాజీ మంత్రి మైఖేల్ మెక్‌గ్రాత్ కొత్త ఆర్థిక మంత్రిగా డోనోహో స్థానాన్ని తీసుకుంటారు.

Next Story