హెచ్ 1 బీ వీసాల విధివిధానాల్లో మార్పు..!

By అంజి  Published on  9 Dec 2019 5:17 AM GMT
హెచ్ 1 బీ వీసాల విధివిధానాల్లో మార్పు..!

వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్ 1 బీ వీసా కోసం అప్లై చేసే విధివిధానాలను మారుస్తున్నట్టు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ విభాగం ప్రకటించింది. మొత్తం ప్రక్రియను ఆన్ లైన్ చేస్తున్నట్టు ఈ విభాగం ప్రకటించింది. ఇందులో భాగంగా ఉద్యోగులను అమెరికాలో ఉండేందుకు స్పాన్సర్ చేస్తున్న కంపెనీ ఎలక్ట్రానిక్ విధానంలో రిజిస్టర్ చేసుకోవాలి. తమ కంపెనీ వివరాలను, స్పాన్సర్ చేస్తున్న ఉద్యోగి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి మార్చి 20 వరకూ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది 2021-22 లో పనిచేసే వారి కోసం ఉద్దేశించింది. అంటే ఉద్యోగులు అక్టోబర్ 2020 నుంచి మాత్రమే పనిచేయగలరు. స్పాన్సర్ చేస్తున్న కంపెనీలు పది డాలర్ల నాన్ రిఫండబుల్ ఫీజును ప్రతి రిజిస్ట్రేషన్ కు చెల్లించాల్సి ఉంటుంది.

ఆ తరువాత లాటరీ విధానంలో ఉద్యోగులను ఎంపిక చేయడం జరుగుతుంది. కంపెనీలు ఇలా ఎంపికైన తమ ఉద్యోగి పూర్తి వివరాలను, వివిధ డాక్యుమెంట్లను పొందుపరచాల్సి ఉంటుంది. వీసా అప్లికేషన్లను నమోదు చేయడానికి పరిమితమైన సమయాన్ని ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమౌతుంది. యూఎస్ డిగ్రీలు ఉన్న వారికి విధించిన 20000 పరిమితి తో పాటు మొత్తం యాభై వేల మందికి మాత్రమే ఈ వీసాను ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిమితిలో ఎలాంటి మార్పూ ఉండదు.

‘ఈ ప్రక్రియ వల్ల పేపర్‌వర్క్ తగ్గుతుంది. డాటా ఎక్స్‌ఛేంజ్ సులువుగా జరుగుతుంది. దీంతో హెచ్1బీ దరఖాస్తులు చేసే కంపెనీలపై, అమెరికా ప్రభుత్వంపై కూడా ఆర్థికభారం తగ్గుతుంది’ అని అమెరికన్ ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది. ఈ ప్రక్రియపై అమెరికన్ ఇమ్మిగ్రేషన్ సర్వీసు వివిధ కంపెనీలకు అవగాహన కల్పించనుంది. అదే విధంగా సాంపిల్ దరఖాస్తులు చేయించడం ద్వారా వారికి ఉన్న అనుమానాలను తొలగిస్తామని ఈ విభాగం ప్రకటించింది.

Next Story