తెలంగాణలో జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు
By తోట వంశీ కుమార్ Published on 7 May 2020 7:28 PM ISTతెలంగాణ రాష్ట్రంలో జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్ ఈ రోజు మొదలైందన్నారు. ఈ నెల 12 నుంచి మూల్యాంకన ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వాల్యుయేషన్‌కు గతంలో 12 సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 సెంటర్లకు పెంచినట్లు చెప్పారు. పేపర్ వాల్యుయేషన్‌కు వచ్చే లెక్చరర్స్‌కు రవాణా సౌకర్యం, వసతి కల్పిస్తామన్నారు. గురువారం పదోతరగతి పరీక్షలు, ఇంటర్ మూల్యాంకనం పై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
856 మంది ఇంటర్ విద్యార్థులకు ఒక పరీక్ష మిగిలిపోయిందన్న మంత్రి సబిత.. వారికి ఈ నెల 18న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా పదో తరగతికి సంబంధించిన ఎనిమిది పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. హైకోర్టు అనుమతి ఇస్తే అన్ని నిర్వహించేందుకు సిద్దమవతున్నట్లు చెప్పారు. విద్యార్థులందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని, పరీక్షా కేంద్రాలను సైతం పెంచనున్నట్లు చెప్పారు. త్వరలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని, అనుమతి వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి విద్యార్థులకు సూచించారు.