ఏపీ: ఆన్‌లైన్‌లో ఇంటర్మీడియేట్ ప్రవేశాలు
By సుభాష్ Published on 21 Oct 2020 3:19 AM GMTకరోనా మహమ్మారి కారణంగా దేశంలో అన్ని రంగాలతో పాటు విద్యాసంస్థలు సైతం మూతపడ్డాయి. ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు తెరుచుకున్నాయి. విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఆన్‌లైన్‌లోనే ఇంటర్మీడియేట్ ప్రవేశాలు నిర్ణయించినట్లు ఇంటర్మీడియేట్ బోర్టు సెక్రటరీ వి.రామకృష్ణ తెలిపారు. https ://bie.ap.gov.in ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ దరఖాస్తులు గురువారం నుంచి ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశం ఉంది.
కాగా, ఈనెల 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అవకాశాన్నికల్పించినట్లు ఆయన వివరించారు. అయితే రెండేళ్ల ఇంటర్మీడియేట్ రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. బీసీ, ఓసీ విద్యార్థులకు రూ.200 ఫీజు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100 చెల్లించాలన్నారు. విద్యార్థులు తమ సందేహాల కోసం 18002749868 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.