హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 8.45 గంటలకు తమకు కేటాయించిన సీట్లలో విద్యార్థులు కూర్చున్నారు. అయితే ఈ సారి నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని ఇంటర్‌ బోర్డు కల్పించింది. ఇవాళ ఇంటర్‌ ఫస్టియర్‌ స్టూడెంట్స్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రేపు ఇంటర్‌ సెకండీయర్‌ స్టూడెంట్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9,65,839 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లను నియమించారు. అలాగే మొత్తం 25,550 మంది పరీక్షా నిర్వహకులను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారానికి బోర్డు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లోని బిగ్‌ ఆర్‌ఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను స్వీకరించనున్నారు. హైదరాబాద్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040-24600110. ఈ నెంబర్‌కు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్‌ చేయవచ్చు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,411 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10,65,156 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కాగా 105 చోట్ల సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ప్రిన్సిపాల్‌ సంతకం లేకుండా ఆన్‌లైన్‌లో క్యూ ఆర్‌ కోడ్‌తో హాల్‌ టికెట్‌ డౌన్‌ లోడ్‌ చేసుకునే సౌకర్యం కల్పించారు. నో యువర్‌ సీట్‌ పేరుతో ప్రత్యేక యాప్‌ ద్వారా పరీక్షా కేంద్రాల్లో గదుల గుర్తింపు విధానాన్ని తీసుకువచ్చారు అధికారులు. తొలిసారిగా వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరీక్షా కేంద్రాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో ఇంటర్‌ ఫస్టియర్‌ సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు సెట్‌ నంబర్‌-2ను ఇంటర్‌ బోర్డు ఎంపిక చేసింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.