మే 11 నుండి ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం
By తోట వంశీ కుమార్ Published on 7 May 2020 6:34 PM ISTఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మే 11 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో పరీక్షల మూల్యాంకానానికి సంబంధించిన విధివిధానాలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మే 11 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రెడ్ జోన్లలో మాత్రం లాక్‌డౌన్ తరువాత ప్రారంభిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇప్పటికే ఐసెట్, ఈసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు తేదీలను ప్రకటించిన నేపథ్యంలో త్వరితగతిన ఇంటర్మీడియట్ మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉందన్నారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, మూల్యాంకన ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి కావలసిన భోజనం, వసతి ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు పరీక్షలు రాసారని, మొత్తంగా 10,64,442 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. వీరికి సంబంధించి సుమారు 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉందన్నారు. మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా, నాణ్యమైనదిగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ప్రతిరోజూ ఉదయం 8 గం.ల నుండి మధ్యాహ్నం 1 గం. వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 1 గం. నుండి సాయంత్రం 6 గం.ల వరకు మరో షిప్టులో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబుపత్రాలు ప్రతిరోజూ మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. మూల్యాంకన ప్రక్రియలో 25 వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు.
జూన్ చివరి నాటికి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో విద్యార్థులకు ఆన్ లైన్ లో థియరీ క్లాసులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్ కు సంబంధించిన వీడియోలు పొందుపరుచనున్నామని మంత్రి తెలిపారు.