కర్ణాటకలో అమానుషం...దివ్యాంగుడిని మట్టిలో పాతిపెట్టిన కుటుంబం
By Newsmeter.Network Published on 26 Dec 2019 1:05 PM ISTబెంగళూరు: సూర్యగ్రహణం రోజు కర్ణాటకలో ఓ అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రహణ సమయంలో మట్టిలో పాతిపెడితే అంగవైకల్యం పోతుందన్న మూఢ నమ్మకంతో ఇద్దరు చిన్నారులను కుటుంబ సభ్యులు మట్టిలో పాతిపెట్టాడు. ఇద్దరు చిన్నారులు పుట్టుకతోనే దివ్యాంగులు. ఓ వైపు సూర్యుడిపైకి మనిషిని పంపే దిశగా ఇస్రో శాస్ర్తవేత్తలు ప్రయత్నాలు చేస్తుంటే.. సూర్యగ్రహణం రోజు ఇలాంటి మూఢ నమ్మకాలు బయటపడుతున్నాయి. సూర్యగ్రహణం మొదలు నుంచి పూర్తయ్యేంత వరకూ ఆ ఇద్దరు చిన్నారులను మెడ వరకూ పాతిపెట్టారు. ఆ పసివాడు వద్దని ఏడుస్తూ ఎంత మొత్తుకుంటున్నా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. సుమారు మూడు గంటల పాటు చిన్నారులను మట్టిలో కప్పి ఉంచారు. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మి వాటిని పిల్లలపై రుద్దవద్దని జన విజ్ఞాన వేదిక వారు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మానవత్వానికి మాయని మచ్చలా ఉంటాయంటున్నారు. మూఢ నమ్మకాలపై ఉన్న అపోహాలను తొలగించడానికి అక్కడి అధికారులు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
ఉత్తర కర్నాటకతో పాటు ఇటు అనంతపురం జిల్లాలో కూడా కొంత మంది వింత ఆచారాలు పాటిస్తున్నారు. కల్యాణదుర్గంలో జిల్లేడు చెట్లకు తాయెత్తులు కట్టి మహిళలు వింత ఆచారాలు పాటిస్తున్నారు. సూర్యగ్రహణం వల్ల అరిష్టం కలగకూడదని ప్రత్యేక పూజలు చేశారు. పాత నమ్మకాలపై జన విజ్ఞాన వేదిక మండిపడుతోంది. మూఢ నమ్మకాల పేరుతో మనుషులను వేధింపులకు గురి చేస్తున్నారని, ఇలాంటి చర్యలు మూర్ఖపు చర్యలని జనవిజ్ఞాన వేదిక సభ్యులు పేర్కొన్నారు. ఏది ఏమైనా సూర్యగ్రహణం రోజున ఒక్కో ప్రాంతంలో ఒక్క వింత ఆచారంతో ప్రజలను షాక్‌కు గురి చేశారు.