ఇండోర్‌ను టాప్‌లో నిలిపిన తెలంగాణ బిడ్డ
By తోట వంశీ కుమార్ Published on 28 Aug 2020 11:40 AM ISTఇండోర్ మరోసారి పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలుచుంది. ఇలా ర్యాంకు సాధించడం నాలుగోసారి. ప్రభుత్వాధికారులు, ప్రజలు నాయకులు కలిసికట్టుగా విజయమిది. ఈ గెలుపు వెనక ఓ హీరో నిరంతర శ్రమ కూడా ఒదిగి ఉంది. అతనే అప్పటి ఇండోర్ కలెక్టర్ , ప్రస్తుత మధ్యప్రదేశ్ ఐ అండ్ పీఆర్ కమిషనర్ పరికిపండ్ల నరహరి . ఇండోర్ అద్దంలా తళతళలాడేందుకు విశేషంగా శ్రమించారు. నిరంతరం చెదరని చిరునవ్వులతో అందరినీ జాగృతపరచి పరిశుభ్రతకు పెద్దపీట వేసేలా చేసిన పి.నరహరి కరీంనగర్ వాసి.
కరోనా లాంటి మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన నేపథ్యంలో మళ్ళీ స్వచ్ఛత పరిశుభ్రత అనే అంశాలు తెరపైకి వచ్చాయి. ఇవేం కొత్త అంశాలు కాదు. కరోనా నుంచి దూరంగా ఉండాలంటే ఒకటే దాకి ముఖానికి మాస్క్ ధరించడం…చేతుల్ని శానిటైజర్లతో ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటుండం. వ్యక్తిగత పరిశుభ్రతే కాదు…పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలి అన్న ప్రచారం హోరెత్తిపోతోంది. అయితే కరోనా కాలం కంటే ముందుగానే ఇండోర్ ప్రజలు పరిశుభ్రతపై అవగాహన పెంచుకున్నారు. దేశంలో పరిశుభ్రంగా ఉండే నగరం ఏది? పట్టణమేది? పల్లె ఏది? ఇలాంటి పోటీలను నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక స్వచ్ఛ భారత్ మిషన్ పేరిట నిర్వహిస్తున్నారు. జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించడం చాలా కష్టసాధ్యం. ఎక్కడికక్కడ చెత్త పేరుకు పోతుండటం, చెత్తకుండీలను ఉంచకపోవడం లాంటివి లేకపోలేదు. అయితే దేశంలో ఏటా స్వచ్ఛంగా ఉంటున్న ప్రాంతాలు ఏవి అన్న సర్వే జరుగుతునే ఉంటుంది. ఈ స్పర్దలో ముందువరసలో ఉండే ప్రాంతాలు లేకపోలేదు. అయితే ఏ ఒక్కరి వల్లో ఇది సాధ్యపడదు. అందరిలోనూ ఆ భావన ఉంటేనే నూటికి నూరుశాతం స్వచ్ఛత సాధించగలం. ఇదే మాట ఇండోర్ వాసులంటున్నారు.
2016 లో ఇండోర్ పరిస్థితి వేరుగా ఉండేది. చాలా నగరాల్లా అపరిశుభ్రతకు మారుపేరుగా ఉండేది. ప్రజల్లో పరిశుభ్రతపై ఏమాత్రం అవగాహన లేకపోవడమే కాదు…పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్య ధోరణి కనిపించేది. ఎక్కడపడితే అక్కడ చెత్తచెదారం కనిపించేది. తడి,పొడి చెత్తల్ని వేరు చేయాలన్న స్పృహ ఎవరికీ ఉండేది కాదు. నగరం మురికిమయంగా మారిపోయి కాలుష్యానికి కారకమయ్యేది. ప్రజలు ఈ చెత్తతోనే సహజీవనం చేస్తుండేవారు. కంపు కొడుతోందని ముక్కు మూసుకోవడమే కానీ…ఆ కంపును తొలగించే దారుల్ని ఆలోచించేవారు కాదు. అధికారులు, రాజకీయ నాయకులకు కూడా ఈ చెత్త విషయం పట్టేది కాదు.
ఈ స్థితిలోని ఇండోర్‌కు నరహరి కలెక్టర్‌గా వచ్చాక…తన ముందున్న కర్తవ్యం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమేనని తెలుసుకుని అందుకు విశేషంగా శ్రమించారు. మొదట్లో కలెక్టర్ ఇంత అప్రాధాన్య విషయంపై విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాడేంటి అనుకున్న వారూ లేకపోలేదు. మార్పు రాత్రికి రాత్రే రాదు కదా…దాని కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి. నరహరి అదే పని చేశారు. ఇప్పుడు ఇండోర్ ప్రజలు నరహరినే కాదు స్వచ్ఛతను కూడా నూటికి నూరుశాతం నమ్ముతున్నారు. దానికోసం సమైక్యంగా పాటుపడుతున్నారు.
ఇండోర్‌ను వందశాతం స్వచ్ఛనగరంగా మార్చడానికి రెండేళ్ల వ్యవధి పట్టింది. తొలుత ఇండోర్ రూరల్ ప్రాంతాన్ని చెత్తరహిత ప్రాంతంగా మార్చడానికి ప్రయత్నించారు. అది విజయవంతం అయ్యాక ఇండోర్ నగరంలో అదే వ్యూహాన్ని అమలు చేశారు. నగరంలో చెత్త పేరుకు పోతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ చెత్త వేయడానికి ప్రత్యమ్నాయాలను నిర్దేశించారు. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు, సాయంత్రాలు అధికారులు ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ప్రజలు మరుగుదొడ్లు వినియోగించేలా చైతన్యపరిచారు. ఇండోర్ నగరం చెత్త రహితంగా మారింది. ఇప్పుడు నగరం వీధుల్లో కనిపించే చిన్న చిన్న చెత్త కుండీలను తొలగించేశారు. చెత్తను సేకరించేందుకు ఇంటింటికీ తిరిగే చెత్తబండ్లపై ప్రజలకు అవగాహన కల్పించారు.
చెత్తను సేకరించే ప్రతి బండిలో 'హో హల్లా' పాట వినిపిస్తుంటుంది. బాలివుడ్ గాయకుడు షాన్ పాడిన ఈ పాట ఇప్పుడు ఇండోర్ నగర ప్రజలకు మేలుకొలుపు పాటగా మారిపోయింది. ఈ పాట ఎంతగా పాపులర్ అయిందంటే చిన్న పిల్లలు కూడా దీన్ని హమ్ చేస్తుంటారు. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి సంగీతాన్ని మించిన సాధనం ఏముంటుంది? నరహరి దీన్ని నమ్మారు కాబట్టే ప్రజల్లో తన చేతల ద్వారా, పాట ద్వారా మార్పు తీసుకురాగలిగారు.
కేవలం చెత్తను తొలగించే కార్యక్రమాలకే నరహరి పరిమితం కాలేదు. ఇండోర్ రూరల్, అర్బన్ ప్రాంతాల్లో పేద అమ్మాయిల పెళ్ళి కోసం ఓ పథకం తేవాలనుకున్నారు. కలెక్టర్‌గా, ఐసీడీఎస్ అధికారిగా ఏడాది పాటు పలు ప్రాంతాల్లో తిరిగి లాడ్లీ లక్ష్మియోజన పథకాన్ని రూపొందించారు. క్షేత్ర స్థాయిలో మహిళలతో చర్చించి రూపొందించిన ఈ పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాగే తన ఆలోచనలు ప్రతిబింబించేలా ఆలయ ఫౌండేషన్ స్థాపించారు. తనలాగే పదుగురు యువకులు ఎదగాలన్నదే నరహరి ఆశయం. తన ఫౌండేషన్ ద్వారా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై ఫౌండేషన్ ద్వారా శిక్షణనిస్తున్నారు.
తన అవిశ్రాంత సేవలతో ఇండోర్ ప్రజల మనసు గెలుచుకున్న నరహరి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. పెద్దపల్లిలో టైలర్‌గా పని చేస్తున్న సత్యనారాయణ, సరోజ దంపతులకు మూడో సంతానం నరహరి. చిన్ననాటి నుంచే చదువుల్లో చురుకుగా ఉండే నరహరి ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు సాధించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరంగ్ చదివారు. 1999లో సివిల్స్ రాశారు. తొలొ ప్రయత్నం విజయవంత కాకపోయినా నిరాశ చెందక ఉద్యోగం చేసుకుంటూనే ప్రిపేర్ అయ్యారు. 2001లో తన రెండో ప్రయత్నంలో 78వ ర్యాంకు సాధించారు. మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణానంతరం 2002లో చింద్వారాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ ఐ అండ్‌పీఆర్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.