వంద మంది గ్రేట్ మహిళల జాబితాలో ఇందిరమ్మ, రాజకుమారి అమృత్ కౌర్

By సుభాష్  Published on  6 March 2020 8:10 AM GMT
వంద మంది గ్రేట్ మహిళల జాబితాలో ఇందిరమ్మ, రాజకుమారి అమృత్ కౌర్

సుప్రసిద్ధ పత్రిక టైమ్స్ ప్రపంచంలోన అత్యంత ప్రభావవంతమైన వందమంది మహిళల జాబితాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి, స్వతంత్ర భారత దేశంలోని తొలి ప్రభుత్వంలోని తొలి మహిళా మంత్రి రాజకుమారీ అమృతకౌర్ కు స్థానం కల్పించింది. గత వందేళ్లలో ప్రపంచాన్ని ప్రభావితం చేసినప్పటికీ కనిపించకుండా ఉన్న మహిళామణుల జాబితాలో వీరిద్దరికీ చోటు లభించింది. కౌర్ ను 1947 లో వుమన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించగా, ఇందిరా గాంధీని 1876 లో ప్రకటించింది.

ఇందిరా గాంధీ ని టైమ్స్ అత్యంత జనాకర్షక నేతగా చెబుతూనే నియంతృత్వాన్ని ప్రొత్సహిస్తున్న వ్యక్తిగా పేర్కొంది. 1975 నాటికి ప్రజా వ్యతిరేకత, ఉద్యమాల ను అణచివేసేందుకు ఆమె ఎమర్జెన్సీని తీసుకువచ్చారని టైమ్స్ పేర్కొంది. ఆక్స్ ఫర్డ్ లో చదువుకున్న రాజకుమారి అమృత కౌర్ గాంధీ విధానాల వల్ల ప్రభావితమై స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారు. విదేశీ దాస్య బంధనాలను తొలగించేందుకు ఆమె కృషి చేశారని టైమస్ రాసింది. మహిళలకు వోటు హక్కు, విడాకుల చట్టం, బాల్య వివాహాల వ్యతిరేకత వంటి అంశాల్లో ఆమె భారీ ప్రజా ఉద్యమాలను లేవదీశారు. భారత దేశపు తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె శిశు సంక్షేమ శాఖను ఏర్పాటు చేశారు. మలేరియాను అరికట్టడంలో కీలక పాత్ర వహించారు.

టైమ్స్ పత్రిక గత 70 ఏళ్లుగా మాన్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటిస్తోంది. 1999 నుంచి మాన్ ఆఫ్ ది ఇయర్ ను పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా మార్చారు. అయినప్పటికీ ఎక్కువగా మగవారిని మాత్రమే ఎంపిక చేశారు. అందుకే ఈ వంద మంది మహిళల ప్రాజెక్టును టైమ్స్ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహిళల జాబితాను రూపొందించారు. ఇందులో ఇప్పటి వరకూ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా కవర్ పేజీని అలంకరించిన 11 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ జాబితాలో వర్జీనియా వుల్ఫ్, క్వీన్ ఎలిజబెత్, డిజైనర్ కోకో చానెల్, మెర్లీన్ మన్రో, యువరాణి డయానా, మిషెల్ ఒబామా వంటి వారు ఉన్నారు.

Next Story