టీమిండియాలోకి దేశవాళీ క్రికెటర్‌ ఎంట్రీ..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 10:46 AM GMT
టీమిండియాలోకి దేశవాళీ క్రికెటర్‌ ఎంట్రీ..

రాంచీ: దేశవాళీ క్రికెట్లో చూపిన ప్రతిభకు యువ క్రికెటర్‌ షాబాజ్‌ నదీమ్‌కు తగిన ప్రతిఫలం దక్కింది. చాలా కాలంగా నదీమ్ ఝార్ఖండ్‌ జట్టు తరుపున దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. అయితే కార్ణాటకలో జరుగుతున్న విజయ్‌ హజారే టోర్నీలో అప్పడే ఆడి తన గదికి చేరుకున్నాడు. ఇంతలో టీమిండియా సిబ్బంది నుంచి అతడికి ఫోన్‌ వచ్చింది. దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడబోయే మూడో టెస్ట్‌లో అతడిని తీసుకుంటున్నారనేది సారాంశం. దీంతో నదీమ్‌ ఆనందానికి అవధుల్లేవ్. సరిగ్గా 14 గంటల తర్వాత రాంచీ మైదానంలో అతడి చేతికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు క్యాప్‌ ను అందించాడు. ఈ సందర్భంగా నదీమ్‌ మాట్లాడుతూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియాలో ఆడాలన్న తన లక్ష్యం నెరవేరిందన్నాడు. ఈ లక్ష్యం కోసమే తాను పదిహేనేళ్ల క్రితం ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టినట్లు తెలిపాడు. ఇన్ని రోజులకు తన కల నెరవేరిందని పేర్కొన్నాడు. అనంతరం సెలక్టర్లకు ధన్యవాదాలు తెలిపాడు.

నదీమ్‌ భారత్‌-ఏ తరఫున సత్తా చాటుతున్నాడు. రంజీల్లో వరుసగా రెండు సీజన్లలో వరుసగా 50+ వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. 110 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 424 వికెట్లు సాధించాడు. 19 సార్లు ఐదు వికెట్లు, 5 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. ‘ఎడమ భుజం నొప్పితో బాధపడుతున్నానని కుల్‌దీప్‌ యాదవ్‌ శుక్రవారం తెలియజేయడంతో నదీమ్‌ను ఎంపిక చేశాం’ అని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు. 2018లో నదీమ్‌ను వెస్టిండీస్‌పై వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో చోటివ్వలేదు.

Next Story
Share it