ధోనికి సాధ్యం కానిది.. రాహుల్ చేశాడు

By Newsmeter.Network  Published on  11 Feb 2020 11:13 AM GMT
ధోనికి సాధ్యం కానిది.. రాహుల్ చేశాడు

మౌంట్‌ మాంగనీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో లోకేష్‌ రాహుల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 62/3తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన రాహుల్.. అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. 113 బంతుల్లో 112 పరుగులు సాధించాడు. 9 ఫోర్లు, 2 భారీ సిక్సర్లను బాదాడు. ఈ క్రమంలో 21 ఏళ్ల తర్వాత ఆసియా బయట వన్డేల్లో సెంచరీ చేసిన భారత రెండో వికెట్‌ కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతక ముందు ఇంగ్లండ్‌లో శ్రీలంకతో 1999లో జరిగిన మ్యాచ్‌లో గ్రేట్‌ వాల్.. రాహుల్‌ ద్రావిడ్‌ సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరు రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌లు కాకపోవడం గమనార్హం. ఐదు లేక ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసి సెంచరీ సాధించిన వికెట్‌ కీపర్‌గా ధోని పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. 2017లో కటక్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌​ ధోని 134 పరుగులు చేశాడు.

గబ్బర్‌ తర్వాత..

టీమిండియా తరుపున తక్కువ ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు చేసిన రికార్డునూ నెలకొల్పాడు. టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 24 ఇన్నింగ్స్‌లలో ఆ ఘనత సాధించగా.. లోకేశ్‌ రాహుల్‌ 31 ఇన్నింగ్స్‌లో ఆ ఘనత అందుకున్నాడు. ఇక పరుగుల యంత్రం విరాట్ కోహ్లి 36, గౌతం గంభీర్‌ 44, వీరేంద్ర సెహ్వాగ్‌ 50 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ రాహుల్ సెంచరీ సాయంతో నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. 297 పరుగుల విజయ లక్ష్యాన్ని.. మార్టిన్ గప్తిల్ (66: 46 బంతుల్లో 6x4, 6x6), హెన్రీ నికోలస్ (80: 103 బంతుల్లో 9x4), గ్రాండ్‌హోమ్ (58 నాటౌట్: 28 బంతుల్లో 6x4, 3x6) లు రాణించడంతో కివీస్ 47.1 ఓవర్లలో 5వికెట్ల కోల్పోయి 300 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

Next Story
Share it