పంత్‌ను ఆడించాలనుకుంటే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 March 2020 10:23 AM GMT
పంత్‌ను ఆడించాలనుకుంటే..

టెస్టుల్లో రిషబ్ పంత్‌ని వికెట్ కీపర్‌గా ఆడించాలనుకుంటే తనకేమీ అభ్యంతరంలేదని సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చెప్పాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో సాహాను కాదని రిషబ్‌పంత్‌ను ఆడించింది టీమిండియా మేనేజ్‌మెంట్. తాజాగా రంజీట్రోపీ ఫైనల్‌లో సౌరాష్ట్ర చేతిలో పశ్చిమ్‌ బంగాల్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌ తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో సాహా మాట్లాడాడు. తమ ఓటమికి కారణాలను చెప్పాడు. అలాగే కివీస్‌తో టెస్టు సిరీస్‌కు తుది జట్టులో తనను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. సాధారణంగా ఆటగాడికి తుది జట్టులో చోటుపై మ్యాచ్‌కి కొన్ని గంటల ముందే సమాచారం అందుతుంది. కానీ.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ సమయంలో మ్యాచ్‌కి ముందు మాత్రమే నేను ఆడట్లేదని తెలిసింది. తుది జట్టులో లేనందుకు నాకేమీ బాధగా అనిపించలేదు. ఎందుకంటే.. టీమ్‌లోనే ఉన్నాను కాబట్టి. ఏది ఏమైనా.. టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని గౌరవించాలి. ఒకవేళ రిషబ్ పంత్‌ని టీమ్‌లో ఆడించాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే..? అంతిమంగా టీమ్ గెలవడమే నాకు ముఖ్యమని సాహా చెప్పాడు.

న్యూజిలాండ్‌తో నేను టెస్టులు ఆడుతున్నప్పుడు ఎర్రబంతితో సాధన చేశాను. ఒకవేళ బంగాల్‌ రంజీట్రోఫీ పైనల్‌కు అర్హత సాధిస్తే అక్కడ ఆడదామని అనుకున్నా. జట్టు సభ్యులు తెల్లబంతితో సాధన చేస్తే నేను మాత్రం ఎర్రబంతితో చేశాను. కాగా ఫైనల్‌ మ్యాచ్‌ పిచ్‌.. మేం అనుకున్నట్టుగా లేదు. ఓటమి చెందాక సాకులు చెప్పడం సరికాదన్నారు. ఇక మ్యాచ్‌ జరిగేటప్పుడు అన్ని విభాగాల్లో కాస్త వెనుకబడ్డామని చెప్పాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో సాహాని రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్.. పంత్‌కి వరుసగా అవకాశాలిచ్చింది. ఇదే తరహాలో గత ఏడాది పంత్‌‌ని కూర్చోబెట్టి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో సాహాని ఆడించింది. ఈ నేపథ్యంలో.. టెస్టుల్లో రెగ్యులర్‌గా ఎవర్ని ఆడిస్తారు..? అనేదానిపై క్లారిటీ రావడం లేదు.

Next Story