భారత్‌కు చెందిన మహిళకు అమెరికా పౌరసత్వం.. ట్రంప్ ఆధ్వర్యంలో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Aug 2020 10:43 AM GMT
భారత్‌కు చెందిన మహిళకు అమెరికా పౌరసత్వం.. ట్రంప్ ఆధ్వర్యంలో

వాషింగ్టన్ లోని వైట్ హౌస్ ఐదు దేశాలకు చెందిన వారికి అమెరికా పౌరసత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమం ట్రంప్ ఆధ్వర్యంలో చోటుచేసుకోవడం విశేషం. పౌరసత్వం అందుకున్న వారిలో భారత్ కు చెందిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్ ఉండడం విశేషం. ఈ కార్యక్రమంలో ఇండియా, బొలీవియా, లెబనాన్, సూడాన్, ఘనా దేశాలకు చెందిన ఐదుగురు యూఎస్ పౌరసత్వాన్ని స్వీకరించారు. ట్రంప్ పక్కనే నిలబడి చూస్తుండగా, హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి చాడ్ వోల్ఫ్ వారితో ప్రమాణం చేయించారు. గులాబీ రంగు చీర కట్టుకుని వచ్చిన సుధా సుందరి, ట్రంప్ చేతుల మీదుగా పౌర పట్టాను అందుకున్నారు.

ఐదుగురు అసాధారణ వ్యక్తులను అమెరికా తన కుటుంబంలోకి నేడు సాదరంగా ఆహ్వానిస్తోందని, వారికి తన శుభాకాంక్షలని ట్రంప్ అన్నారు. అమెరికా దేశాన్ని, రంగును, మతాన్ని చూడబోదని ట్రంప్ అన్నారు. ఆ విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నామని.. అమెరికా ఓ అద్భుత దేశమని అన్నారు. కుడి చేతిని పైకి లేపి చూపుతూ, మరో చేత్తో అమెరికా జెండాను పట్టుకుని అమెరికా పౌరులమని సంప్రదాయ ప్రమాణాన్ని చేసిన వీడియోను రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో ప్రసారం చేయనున్నారు.

భారత్ లో జన్మించి, 13 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లారు సుధా సుందరి నారాయణన్, సాఫ్ట్ వేర్ డెవలపర్ గా అద్భుతమైన విజయాలను సాధించారు. ఆమెకు ఎంతో టాలెంట్ ఉందని, సుధా దంపతులు అమెరికాకు ఎంతో చేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఎలక్షన్స్ దగ్గరలో పడిన సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రవాస భారతీయుల ఓట్లు మాత్రమే కాదు.. మిగిలిన దేశాల సంతతికి చెందిన ఓటర్లను కూడా ఆకర్షించడమే పనిగా ట్రంప్ ఇటీవలి కాలంలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ట్రంప్ ప్లాన్ వర్కౌట్ అయ్యి రెండో సారి కూడా ఆయన్ను అధ్యక్ష పీఠం మీద కూర్చోబెడతారో లేక ఒక్క సారికే మీ సేవలను భరించలేకపోతున్నాం మహా ప్రభో అంటూ నవంబర్ లో ఇంటికి సాగనంపుతారో తెలియాల్సి ఉంది.

Next Story