భారత్ కు చెందిన మనీందర్ సింగ్ అనే వ్యక్తి అమెరికాలో హత్యకు గురయ్యాడు. ఒక స్టోర్ లో దొంగతనానికి వచ్చిన దుండగులు మనీందర్ పై కాల్పులు జరపడంతో అతను..అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల మేరకు..హరియాణా రాష్ర్టం కర్నాల్ కు చెందిన మనీందర్ సింగ్ సాహి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని ఒక స్టోర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం సుమారు 5.30 గంటల ప్రాంతంలో మనీందర్ తో పాటు..ఇద్దరు కస్టమర్లు స్టోర్ లో ఉన్నారు. ఇంతలోనే గుర్తుతెలియని వ్యక్తి మాస్క్ ధరించి స్టోర్ లోకి వచ్చి మనీందర్ పై కాల్పులు జరిపి హత్య చేశాడు. స్టోర్ లో ఉన్న మిగతా ఇద్దరిపై దుండగుడు ఎలాంటి దాడికి పాల్పడలేదు. మనీందర్ ను హత్యచేసిన అనంతరం కౌంటర్ లో ఉన్న నగదు తీసుకుని ఉడాయించాడు. స్టోర్ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఈ హత్య తాలూకు దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. నేరస్థుడిని త్వరలోనే పట్టుకుంటామని వారు పేర్కొన్నారు.

జనవరి 31వ తేదీన తన కుటుంబాన్ని కలిసి..తిరిగి అమెరికాకు వెళ్లిన మనీందర్ సింగ్ ఇప్పుడు నిర్జీవంగా మారడంతో అతడి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మనీందర్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కాగా..మనీందర్ సింగ్ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు తమవద్ద డబ్బులు లేవని..మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు భారత ప్రభుత్వం సహాయం చేయాల్సిందిగా మృతుడి సోదరుడు కోరాడు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.