క్రికెట్ కంటే ప్రాణం ముఖ్యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2020 2:00 PM GMT
క్రికెట్ కంటే ప్రాణం ముఖ్యం

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి క్రీడారంగం కుదేలైంది. క‌రోనా ముప్పుతో ప‌లు క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని టోర్నీల‌ను ర‌ద్దు చేశారు. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) ఏప్రిల్ 15 కు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా క‌ట్ట‌డికి ఈ నెల 14 వ‌ర‌కు దేశవ్యాప్త లాక్‌డౌన్ అమ‌లులో ఉంది. దీంతో 15 నుంచి ఐపీఎల్-13వ సీజ‌న్ నిర్వ‌హించ‌డం దాదాపుగా అసాధ్యం.

తాజాగా టీమ్ఇండియా క్రికెట‌ర్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాడు సురేశ్ రైనా మాట్లాడుతూ.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క్రికెట్‌ కంటే ప్రాణాలే ముఖ్య‌మని అన్నాడు. క‌రోనాలాంటి సంక్షోభ ప‌రిస్థితుల్లో ప్ర‌జా భ‌ద్ర‌త‌కే ప్రాముఖ్య‌మివ్వాల‌ని సూచించాడు. ఐపీఎల్‌-13వ సీజ‌న్ కోసం మ‌రికొంత కాలం ఎదురుచూడ‌క త‌ప్ప‌ద‌ని పేర్కొన్నాడు. మ‌రోవైపు క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం నిర్దేశించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని సూచించాడు. లేక‌పోతే త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సిన ఉంటుంద‌ని తెలిపాడు. క‌రోనా ముప్పు తొలిగాక ఐపీఎల్ గురించి ఆలోచించ‌వ‌చ్చున‌న్నాడు.

క‌రోనా క‌ట్ట‌డికి త‌న వంతు సాయంగా సురేశ్ రైనా 52 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మ‌రోవైపు మ‌న‌దేశంలో క‌రోనా వైర‌స్ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 56 మందికి పైగా చ‌నిపోగా.. 2300 క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story