టెస్టింగ్‌ సెంటర్‌గా క్రికెట్‌​ స్టేడియం..!

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 3 April 2020 6:56 PM IST

టెస్టింగ్‌ సెంటర్‌గా క్రికెట్‌​ స్టేడియం..!

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల 53వేల మంది మృత్యువాత ప‌డ‌గా.. ప‌దిల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని ఎలా నియంత్రిచాలో తెలియ‌క చాలా దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. అయినా కూడా ఈ మ‌హ‌మ్మారి ఏ మాత్రం త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు.

క‌రోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో ఆస్ప‌త్రులు చాల‌టం లేదు. క‌రోనా టెస్టుల కోసం పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి చాలా దేశాలు. రైళ్లు, స్పోర్ట్స్‌ అకాడమీలు ఇలా ప్రతీ దాన్ని వినియోగించుకునే పనిలో ప‌డ్డాయి.

తాజాగా ఇంగ్లాండ్‌లోని ఓ క్రికెట్ స్టేడియాన్ని టెస్టింగ్ సెంట‌ర్‌గా మార్చే ఆలోచ‌న‌లో ఉన్నారు. ప్రముఖ ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియాన్నికోవిడ్‌-19 టెస్టింగ్‌ సెంటర్‌గా మార్చ‌నున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియాన్ని కరోనా వైరస్‌ టెస్టింగ్‌ సెంటర్‌గా మార్చడానికి కసరత్తులు పూర్తి చేసినట్లు వార్విక్‌షైర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నీల్‌ స్నో బాల్‌ తెలిపారు.

‘ మా దేశంలో క్రికెట్‌ సంబంధిత కార్యక్రమాలు, సమావేశాలు, ఈవెంట్స్‌, వ్యాపార కార్యకలాపాలు అన్నీ కూడా మే 29వరకూ బంద్‌ చేశాం. ఈ క్లిష్ట సమయంలో మా సిబ్బంది అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండటంపైనే దృష్టి సారించింది. దీనికి మా మాజీ ఆటగాళ్ల సాయం కూడా తీసుకుంటున్నాం. ఎడ్జ్‌బాస్టన్‌ను కరోనా వైరస్‌ సెంటర్‌గా మార్చడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. ఇందుకు అనుమతి లభించిన వెంటనే ఇక్కడ కరోనా టెస్టింగ్‌ సెంటర్‌ అందుబాటులోకి వస్తుంది’ అని నీల్‌ స్నో బాల్‌ తెలిపారు.

మ‌రోవైపు ప్ర‌తిష్టాత్మ‌క లార్డ్స్ మైదానంలో మెడికల్ సిబ్బందికి స్టోరేజ్, పార్కింగ్ వ‌స‌తులు క‌ల్పించ‌నున్నట్లు మెరిల్‌బోన్ క్రికెట్ క్ల‌బ్ (ఎంసీసీ) ప్ర‌తిపాదించింది.

ఇంగ్లాండ్‌లో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో 53వేల పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. అయితే మూడు వేల‌కుపైగా మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఆ దేశపు ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్‌, యువ‌రాజ్ చార్లెస్‌కు కూడా కోవిడ్‌-19 వ్యాధి సోకిన‌ట్లు తెలుస్తోంది.

Next Story