వాళ్లంతా మంచు కొండల్లో మైనస్ 60 డిగ్రీల చలిలో పనిచేస్తారు. వాళ్లు కాపలా కాస్తున్నారు కాబట్టే మీరు, మేము, మనమంతా హాయిగా నిద్రపోగలుగుతున్నాం. మన కోసం వాళ్లు ప్రాణాలు అడ్డు వేస్తారు. వాళ్ళే సియాచిన్ సరిహద్దుల్లో కాపలా కాసే వీరజవాన్లు.

వారి కోసం మనం స్పందిస్తాం. క్రందిస్తాం. జై జవాన్ అని గొంతు చించుకుంటాం. భారత్ మాతాకీ జై అని బట్టలు చించుకుంటాం. కానీ ఎముకలు కొరికే చలిని తట్టుకునేందుకు కావలసిన దుస్తులను ఇవ్వం. మంచును చూస్తే వచ్చే దృష్టి లోపాన్ని తట్టుకునే కళ్లద్దాలు ఇవ్వం. వేడినిచ్చే ఆహారాన్ని ఇవ్వం. కేవలం జై జవాన్ అని మాత్రం పదేపదే నినదిస్తాం.

అవును.. మనమంతా కృతఘ్నులం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక ఇదే మాట కుండ బద్దలు గొట్టినట్టు, మాడు పగిలేట్టు మరో సారి చెప్పింది. సోమవారం పార్లమెంటు లో సమర్పించిన కాగ్ నివేదిక ప్రకారం మంచుకొండల్లో మైనస్ 60 డిగ్రీల్లో చలిని తట్టుకునే దుస్తులు కొనివ్వడానికి మన సైన్యం రెడీగా లేదట. ఫలితంగా మన సైనికులు సపాత హై ఆల్టిట్యూడ్ వేర్ ను, పాత షూస్ ను వాడాల్సి వస్తోంది. మంచులో వాడాల్సిన ప్రత్యేక గాగుల్స్ విషయంలో 62 నుంచి 98 శాతం కొరత ఉందని నివేదిక తెలియచేసింది. నవంబర్ 2015 నుంచి సెప్టెంబర్ 2016 వరకూ సైనికులకు కొత్త స్నో బూట్స్ మంజూరు చేయలేదు. ఫేస్ మాస్కులు, స్లీపింగ్ బ్యాగ్స్, జాకెట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇక సియాచిన్ లో ఉన్న సైనికులకు ఆహార కొరత కూడా ఉంది. సైనికుల ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల 82 శాతం క్యాలరీల లోపం ఉంది.

ఎందుకిలా జరిగింది అంటే రాజుగారు ఏడు చేపల కథలు చెబుతున్నారు ఏలినవారు. ఆర్మీ తనకు నిధుల మంజూరీ లేదంటోంది. రక్షణ శాఖ రక్షణ చేసిన కేటాయింపులు చాలవంటోంది. పాలకులు ఎక్కువగా కేటాయిస్తే ప్రజలు మాకు వోటు వేయరంటున్నారు. ప్రజలు సైనికులు చస్తే పుష్పగుచ్ఛం ఉంచుదాం కానీ వారికి కోట్లు, జాకెట్లు, స్వెట్టర్లు, స్నో బూట్లు, గాగుల్స్ అవసరం లేదు. మాకు ప్రత్యేక హోదాలు, సంక్షేమ పథకాలు ఇస్తే చాలు అంటున్నారు. దీపికా పాదుకోన్ అందాలు, ప్రియాంకా చోప్రా స్లిట్ గౌను నుంచి సీఏఏ నిరసనలు, ఢిల్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న సగటు భారతీయుడికి సైన్యం ఎలా చస్తే ఏం పట్టింది?

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.