మరో సూపర్ ఓవర్ థ్రిల్లర్..
By Newsmeter.Network Published on 31 Jan 2020 5:28 PM ISTటీ20ల్లో మ్యాచులు టై కావడమే చాలా అరుదు. అలాంటిది భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో వరుసగా రెండు మ్యాచులు టై గా ముగియడం విశేషం. ఇక ఈ రెండు మ్యాచుల్లో కూడా సూపర్ ఓవర్ లో టీమిండియా విజయం సాధించడమనేది సగటు క్రీడాభిమాని ఆనందించే విషయం.
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాల్గో టీ20 టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేయగా, న్యూజిలాండ్ కూడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 165 పరుగులే చేసింది. సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ తొలుత 13 పరుగులు చేయగా టీమ్‌ఇండియా ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్ ఆధిక్యం 4-0కు పెరిగింది. ఆఖరిదైన ఐదో టీ20 మాంట్ మాంగానీలో ఆదివారం జరుగుతుంది.
అంతకముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో సంజు శాంసన్ తో కలిసి కెఎల్ రాహుల్ (39; 26 బంతుల్లో 3పోర్లు, 2సిక్సర్లు) బ్యాటింగ్ ను ఆరంభించారు. రాకరాక అవకాశం వస్తే.. సంజు మరోసారి నిరాశ పరిచాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు కేవలం 5 బంతులు మాత్రమే ఆడి 8 పరుగులు చేసి తొలి వికెట్ గా ఔటయ్యాడు. కుగ్‌లీన్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతిని సిక్స్ కొట్టిన శాంసన్.. రెండో బంతికి పరుగు తీయలేదు. ఇక మూడో బంతికి భారీ షాట్ కొట్టే యత్నంలో సాన్‌ట్నార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
వన్ డౌన్ లో వచ్చిన పరుగులయంత్రం, కెప్టెన్ కోహ్లీ (11; 9 బంతుల్లో 2పోర్లు) బెన్నెట్ బౌలింగ్ లో సాన్‌ట్నర్ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ (1; 7 బంతుల్లో) శివమ్ దూబే (12; 9 బంతుల్లో 2 పోర్లు) వెంటవెంటనే ఔట్ కావడంతో టీమిండియా 88 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ మనీష్ పాండే (50; 36 బంతుల్లో 3పోర్లు) తో జతకలిసిన శార్దుల్ ఠాకూర్ (20; 15బంతుల్లో 2పోర్లు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వీరిద్దరు ఏడో వికెట్ కు 47 పరుగులు జోడించారు. చివర్లో నవదీప్ సైనీ (11; 9బంతుల్లో 2పోర్లు) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి.. కివీస్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బౌలర్లలో సోథీ 3వికెట్లు, బెన్నెట్ 2 వికెట్లు సాధించగా..సౌధీ, సాన్‌ట్నర్, కుగ్‌లీన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కొలిన్ మన్రో (64; 47 బంతుల్లో 6పోర్లు 3సిక్సర్లు), టిమ్ సీఫెర్ట్ (57; 39 బంతుల్లో 4పోర్లు 3సిక్సర్లు) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించారు. వీరిద్దరూ చెలరేగడంతో కివీస్ టార్గెట్ వైపు ఆడుతూ పాడుతూ దూసుకెళ్లింది. విధ్వంసక ఓపెనర్ మార్టన్ గప్తిల్ (4) విఫలమైనా మున్రో-సీఫెర్ట్ రెండో వికెట్ 74 పరుగులు జోడించారు. ఫిఫ్టీ అనంతరం మున్రో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈదశలో టామ్ బ్రూస్ (0) విఫలమైనా. వెటరన్ రాస్ టేలర్ (24)తో కలిసి సీఫెర్ట్ జట్టును విజయం అంచుల వరకు చేర్చాడు. అయితే కీలకదశలో వికెట్లు కోల్పోయిన కివీస్.. నిర్ణీత ఓవర్లో 7 వికెట్ల కోల్పోయి 165 పరుగులే చేసింది. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన తరుణంలో కివీస్ పరుగు మాత్రమే చేసి సాన్‌ట్నార్ వికెట్‌ను కోల్పోయింది. దాంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ కు దారి తీసింది. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లతో రాణించగా బుమ్రా, చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 13 పరుగులు చేసింది. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో సైఫర్ట్, కొలిన్ మున్రో చెరొక ఫోర్ బాదారు. సూపర్ ఓవర్‌లో 14 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కి ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా 6, 4తో మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దీంతో.. సమీకరణం.. 4 బంతుల్లో 4 పరుగులుగా మారిపోయింది. అయితే.. మూడో బంతికి రాహుల్ ఔటవగా.. నాలుగో బంతికి డబుల్ తీసిన కోహ్లీ.. ఐదో బంతిని బౌండరీకి తరలించి భారత్‌ని గెలిపించాడు. మూడో టీ20 తరహాలో సూపర్ ఓవర్‌ని ఈ మ్యాచ్‌లోనూ టిమ్ సౌథీనే వేయడం గమనార్హం.