రెండో టీ20లో భార‌త్ ఘ‌న విజ‌యం..

By Newsmeter.Network  Published on  26 Jan 2020 3:54 PM IST
రెండో టీ20లో భార‌త్ ఘ‌న విజ‌యం..

ఆక్లాండ్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. భార‌త్ అన్ని రంగాల్లో రాణించి కివీస్ ను చిత్తు చేసింది. కివీస్ నిర్ధేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని మరో 2.3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8) విఫలమైనా సూపర్ ఫామ్ లో ఉన్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు) సమయోచితంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

రోహిత్ శ‌ర్మ‌తో పాటు వ‌న్ డౌన్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి (11) తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరుకున్నారు. ఈ ద‌శ‌లో రాహుల్ కు శ్రేయాస్ అయ్యర్ ( 33బంతుల్లో 44; 1 పోర్‌, 3 సిక్స‌ర్లు) కూడా తోడవడంతో న్యూజిలాండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. చివ‌ర్లో అయ్య‌ర్ ఔటైనా అప్ప‌టికే భార‌త విజ‌యం లాంఛ‌న‌మైంది. శివమ్ దూబే ఓ భారీ సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు. ఈ విజయంతో ఐదు టి20ల సిరీస్ లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌బించింది. ఆక్లాండ్ లోని ఇదే మైదానంలో జరిగిన తొలి టి20లో సైతం భారత్ నే విజయలక్ష్మి వరించింది.

అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో మార్టిన్‌ గప్తిల్‌ (20 బంతుల్లో 33 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ సెయిఫర్ట్‌ (26 బంతుల్లో 33 పరుగులు, 1 ఫోర్‌, 2 సిక్సర్లు)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(2/18), దుబె(1/16), ఠాకూర్‌(1/21), బుమ్రా(1/21)లు ఆకట్టుకున్నారు. వీరితో పాటు షమీ, చహల్‌లు వికెట్లు పడగొట్టకున్నా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి పరుగులు రాకుండా అడ్డుకున్నారు.

Next Story