అండర్‌-19 వరల్డ్ కప్‌.. క్వార్టర్స్ లోకి యువ భారత్‌

By Newsmeter.Network  Published on  25 Jan 2020 8:13 AM GMT
అండర్‌-19 వరల్డ్ కప్‌.. క్వార్టర్స్ లోకి యువ భారత్‌

అండర్‌ -19 వరల్డ్ కప్‌ లో యువభారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. న్యూజిలాండ్‌ తో మ్యాచ్‌ కు వరుణుడు అడ్డం పడిన భారత విజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు. డక్ వర్త్ లూయిస్‌ పద్దతిలో భారత్‌ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా క్వార్టర్‌ ఫైనల్‌ లోకి అడుగుపెట్టింది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌ లో అమీతుమీ తేల్చుకోనుంది.

శ్రీలంక, జపాన్ లను చిత్తుగా ఓడించిన టీమిండియా శుక్రవారం న్యూజిలాండ్‌ తో తలడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత అండర్‌ -19 జట్టు 23 ఓవర్లు ముగిసే సరికి 115/0 తో నిలిచింది. ఈ దశలో మ్యాచ్‌ కు వరుణుడు అంతరాయం కలిగించాడు. చాలా సమయం వృధా కావడంతో మ్యాచ్‌ ను 23ఓవర్లకే కుదించారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (57 నాటౌట్: 77 బంతుల్లో 4x4, 2x6), సక్సేనా (52 నాటౌట్: 62 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచారు. డక్ వర్త్ లూయిస్‌ పద్దతి ప్రకారం న్యూజిలాండ్‌ అండర్-19 జట్టుకు 23 ఓవర్లలో 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ఛేదనలో ఓపెనర్ మారియ (42: 31 బంతుల్లో 5x4, 1x6), లాలామన్ (31: 19 బంతుల్లో 2x4, 2x6) దూకుడుగా ఆడినా.. మిడిల్ ఓవర్లలో పుంజుకున్న భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఆ జట్టుని 21 ఓవర్లలోనే 147కి ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో రవి 4 వికెట్లు పడగొట్టగా అంకోలేకర్ మూడు వికెట్లు తీశాడు.

ఈ విజయంతో భారత అండర్‌ -19 జట్టు గ్రూప్‌ -ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం ఆస్ట్రేలియాతో క్వార్టర్‌ పైనల్‌ లో తలపడనుంది.

Next Story