జోరు సాగించేనా..?

By Newsmeter.Network  Published on  26 Jan 2020 5:24 AM GMT
జోరు సాగించేనా..?

ఆక్లాండ్ : జోరుమీదున్న భార‌త్ మ‌రో స‌మ‌రానికి సిద్ద‌మైంది. నేడు న్యూజిలాండ్ తో రెండో టీ20లో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. బ్యాటింగ్‌లో ఇరు జ‌ట్లు స‌మఉజ్జీలుగా క‌నిపిస్తున్నా.. బౌలింగే రెండు జ‌ట్ల‌లో ప్ర‌ధాన తేడా. ఈడెన్‌ పార్క్‌ గ్రౌండ్‌లో రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ లో నిల‌బ‌డాల‌ని కివీస్ భావిస్తుండ‌గా.. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా త‌న జోరును కొన‌సాగించాల‌ని భావిస్తోంది.

మార్పులు ఉంటాయా..?

విజ‌యాలు సాధిస్తున్న జ‌ట్టులో సాధార‌ణంగా మార్పులు ఇష్ట‌ప‌డ‌డు కెప్టెన్ విరాట్ కోహ్లి. అయితే మొద‌టి టీ20లో పేస‌ర్ శార్దుల్ ఠాకూర్ భారీగా ప‌రుగులు ఇచ్చాడు. దీంతో అత‌ని పై వేటు వేసి మ‌రో యువఆట‌గాడు నవ‌దీప్ సైనీకి అవ‌కాశం ఇవ్వాల‌ని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. తొలి టీ20లో రోహిత్ విఫ‌ల‌మైయ్యాడు. అయితే రోహిత్ ఒక్క‌సారి కుదురుకుంటే ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాడో అంద‌రి తెలిసిందే. మ‌రో ఓపెన‌ర్ రాహుల్ భీక‌ర ఫామ్ లో ఉన్నాడు. వీరిద్ద‌రి నుంచి మ‌రో సారి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది మేనేజ్ మెంట్. కెప్టెన్ కోహ్లి తో పాటు శ్రేయాస్ అయ్య‌ర్ సూప‌ర్ ఫామ్ లో ఉండ‌డంతో టీమిండియా బ్యాటింగ్ దుర్భేద్యంగా క‌నిపిస్తోంది. బౌలింగ్ లో బుమ్రా త‌ప్ప అంద‌రూ తొలి టీ20లో భారీగా ప‌రుగులు ఇచ్చారు. పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో సైనీని తీసుకోవచ్చు. లేక ఇద్దరు స్పిన్నర్లకు తోడు కుల్దీప్‌ కూడా చేరిస్తే దూబే మూడో పేసర్‌గా సేవలందిస్తాడు.

అదే జ‌ట్టుతో..

సిరీస్‌ ఆరంభంలోనే భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని ఇవ్వకూడదనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. విలియమ్సన్‌, టేలర్‌ తమపై విమర్శలకు దీటుగా స్పందించి భారీషాట్లతో హోరెత్తిస్తూ హాఫ్‌ సెంచరీలు సాధించగలిగారు. అటు మన్రోకు తోడు గప్టిల్‌ ఫామ్‌ అందుకోవడం వీరికి కలిసివచ్చేదే. అయితే మిడిలార్డర్‌లో గ్రాండ్‌హోమ్‌, సీఫెర్ట్‌ ఇద్దరూ విఫలమవడం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది. గాయాల కారణంగా సీనియర్లు సిరీస్‌కు దూరం కావడంతో శుక్రవారం కివీస్‌ బౌలింగ్‌ గత మ్యాచ్‌లో బాగా బలహీనంగా కనిపించింది. బెన్నెట్, టిక్‌నర్‌ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. సీనియ‌ర్లు సౌతీ, సాన్‌ట్నర్‌ రాణించడం కూడా కీలకం.

Next Story