ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా ఈ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం తర్వాత పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెడుతారు. అనంతరం బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది. 12 రోజుల పాటు సాగే ఈ తొలి విడత సమావేశాల్లో బడ్జెట్‌పైనే ప్రధానంగా చర్చించనున్నారు. మార్చి 2న పార్లమెంట్‌ రెండవ విడత సమావేశాలు ప్రారంభం అవుతాయి. నెల రోజుల పాటుగా సాగే ఈ సమావేశాలు ఏప్రిల్ 3వ వరకు కొనసాగుతాయి. ఇందులో మధ్య మధ్యలో సెలవు దినాలు కూడా ఉంటాయి. బడ్జెట్‌ సమావేశాల కోసం పార్లమెంట్‌ సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

రెండు విడతల సమావేశాల మధ్య 3 వారాల సమయం ఉంటుంది. ఈ సమయంలోనే మంత్రిత్వశాఖలకు కేటాయింపులకు పార్లమెంటరీ కమిటీలు పరిశీలించనున్నాయి. దేశం ఆర్థిక మాంద్యంతో నలిగిపోపతున్న తరుణంలో నిర్మాల సీతారామన్ ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌ ఆసక్తి రేపుతోంది. గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతంగా తక్కువ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నమోదు కాబోతోంది. ఇప్పటికే మోదీ ప్రభుత్వం 2025 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ రూపుమార్చాలని కంకణం కట్టుకున్నారు. అప్పటి వరకూ 11 శాతం వార్షిక వృద్ధి నమోదు అయితేనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకుంటుంది.

ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే సీఏఏపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని రద్దు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి శాసనసభ కూడా ఆమోదం తెలిపింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఏపీ మండలి రద్ద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్‌ ఆమోదించే అవకాశాలున్నా.. ఎప్పుడు అమోదిస్తారన్నదే ప్రశ్నగా మారింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.