ఆ సిరీస్‌కు కోహ్లీ సేన.. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే..!
By తోట వంశీ కుమార్ Published on 17 April 2020 8:40 AM GMTకరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. పలు టోర్నీలు పూర్తిగా రద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ మహమ్మారి ముప్పుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 సీజన్ ను నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఐపిఎల్ వాయిదా పడడంతో ఇప్పుడు అందరి దృష్టి అక్టోబర్‌లో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌పై పడింది. ఆస్ట్రేలియా ఈ టోర్నీకి అతిథ్యం ఇవ్వనుంది. ఆస్ట్రేలియాలో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో.. పొట్టి ప్రపంచకప్ జరగడం పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఐసీసీ ప్యూచర్ షెడ్యూల్‌లో భాగంగా.. భారత జట్టు ఈ ఏడాది చివరిల్లో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటలో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా 4 టెస్టులు, 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సిరీస్ జరగడం కూడా అనుమానంగా మారింది.
ఒక వేళ ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో టీమ్ఇండియా పర్యటించాల్సి వస్తే మాత్రం భారత క్రికెటర్లు 14 రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండాలట. ఆస్ట్రేలియా ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి కఠిన ఆంక్షలు విధించింది. అనుకున్న ప్రకారం సిరీస్ జరిగితే.. ఎలా నిర్వహించాలి అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) చాలా కసరత్తులు చేసింది. అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశాల నుంచి ఆస్ట్రేలియా వచ్చే వారంతా.. 14 రోజులు పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లు కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇందుకోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందట. అడిలైట్ ఓవల్‌లో రూ.322 కోట్లతో కొత్తగా ఓ హోటల్ ను నిర్మించారు. విరాట్ సేన వస్తే.. ఈ హోటల్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ టీమ్ఇండియా సాధనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని, హోటల్‌ను అనుకుని ఉన్న నెట్స్‌లో భారత క్రికెటర్లు సాధన చేసుకోవచ్చు. 138 గదులు ఉన్న ఓవల్ హోటల్‌లో ఉంటే.. కోహ్లీ సేనకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని సీఏ బావిస్తోంది.
మరోవైపు అనుకున్న ప్రకారమే వరల్డ్ కప్‌ను నిర్వహిస్తామని టీ20 ప్రపంచకప్ నిర్వాహక కమిటీ సీఈఓ నిక్ హాక్లీ ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.