సెమీస్‌లో తలపడనున్న భారత్‌-పాకిస్థాన్‌ జట్లు

By Newsmeter.Network  Published on  1 Feb 2020 9:05 AM GMT
సెమీస్‌లో తలపడనున్న భారత్‌-పాకిస్థాన్‌ జట్లు

టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతుంది కదా.. ఆ తరువాత వన్డే, టెస్టు మ్యాచులు ఆడనుంది. మరీ పాకిస్థాన్‌ తో మ్యాచ్‌ అంటున్నారేంటీ.. అదీ కూడా సైమీ ఫైనల్‌ లో. అసలేం మాట్లాడుతున్నారని అంటున్నారా.. మరేం లేదండీ బాబూ.. సీనియర్‌ లెవల్‌ లో కాదులెండీ.. జూనియర్‌ లెవల్‌ లో.. అర్థం కాలేదా..!

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో అండర్‌-19 వన్డే వరల్డ్ కప్‌ జరుగుతోంది. ఆస్ట్రేలియాను క్వార్టర్‌ ఫైనల్‌ లో 74 ప‌రుగుల‌తో ఓడించిన యువ భారత్ ఇప్పటికే సైమీఫైనల్‌ కు దూసుకెళ్లింది. ఇక సైమీస్ లో మన ప్రత్యర్థి ఎవరా అని ఆలోచిస్తుండగా మరెవరో కాదు తామేనంటూ పాకిస్థాన్‌ దూసుకొచ్చింది. తాజాగా జ‌రిగిన ఆఖ‌రి క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఆఫ్గానిస్థాన్‌పై గెలిచిన పాక్ సెమీస్‌కు అర్హత సాధించింది. దీంతో మరోసారి భారత్-పాక్‌ మ్యాచ్‌ అభిమానులను కనువిందు చేయనుంది. ఫిబ్ర‌వ‌రి 4న పొచెఫ్‌స్ట్రూమ్‌.. ఈ సమరానికి వేదిక కానుంది.

బెనోనిలో శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్స్‌లో ఆఫ్గాన్‌పై పాక్ ఆరు వికెట్ల‌తో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ 49.1 ఓవ‌ర్ల‌లో 189 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. కెప్టెన్ ఫ‌ర్హాన్ జాకిల్ (40) టాప్ స్కోర‌ర్‌ గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఆడుతూ పాడుతూ 41.1 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. పాకిస్థాన్‌ జట్టులో మ‌హ్మ‌ద్ హురైరా (64) టాప్ స్కోర‌ర్‌ గా నిలిచాడు.

ఇదిలా ఉండగా వరుస విజయాలో ఉన్న టీమిండియాను నిలువరించడం పాకిస్థాన్‌ కు కత్తిమీద సాములాంటిదే. వరుసగా పది విజయాలు సాధించి జోరుమీదున్న యువభారత్ ను పాకిస్థాన్‌ నిలవరించడం కష్టమేనని క్రీడా పండితులు అభిప్రాయ పడుతున్నారు. డిపెండింగ్‌ ఛాంపియన్‌ గా బరిలోకి దిగిన భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందని పలువురు జోస్యం చెబుతున్నారు. కాగా మరో సెమీస్‌ లో బంగ్లాదేశ్‌ తో న్యూజిలాండ్ తలపడనుంది. ఫిబ్రవరి 6న ఈ మ్యాచ్‌ జరగనుంది.

Next Story