వారిద్ద‌రు ఎంట్రీ ఇస్తున్నారు.. లంకేయుల‌కు చుక్క‌లే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jan 2020 11:58 AM GMT
వారిద్ద‌రు ఎంట్రీ ఇస్తున్నారు.. లంకేయుల‌కు చుక్క‌లే..!

కొత్త సంవత్సరంలో మొట్ట‌మొద‌టి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా నేడు మైదానంలోకి అడుగు పెడుతోంది. ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే టీ20 ప్రపంచకప్ సాధ‌నే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. శ్రీలంక‌తో మొద‌టి టీ20లో స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. గౌహ‌తిలోని బర్సపర స్టేడియంలో ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. దాదాపు 2 సంవ‌త్స‌రాల తర్వాత టీమిండియా, శ్రీలంక‌ జట్లు టీ20ల్లో ముఖాముఖి త‌ల‌ప‌డుతున్నాయి. 2018లో జరిగిన నిదాహస్‌ ట్రోఫీ త‌ర్వాత‌ ఈ రెండు జట్లు టీ20ల్లో పోటీపడలేదు. అయితే ఈ మ్యాచ్ ద్వారా గాయాల‌తో జ‌ట్టుకు దూర‌మైన‌ ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. వీరి రాక‌తో టీమిండియా మ‌రింత పుంజుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు.

ఇక‌ గత కొంతకాలంగా గాయంతో బాధ‌ప‌డుతున్న శిఖ‌ర్ ధావ‌న్ ఈ మ్యాచ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. దాంతో కేఎల్ రాహుల్‌తో పాటు సీనియర్‌ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. గాయాలు, ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ధావన్‌కు ఈ సిరీస్‌ పరీక్షగా నిలవనుంది. ఎందుకంటే రోహిత్‌కు రాహుల్‌ మంచి జోడిగా పేరు సంపాదించాడు. దీంతో రెగ్యులర్‌ ఓపెనర్‌ స్థానానికి పోటీ పెరిగింది.

మ‌రో ఆట‌గాడు జస్ప్రీత్ బుమ్రా.. కెరీర్‌ ఆరంభం నుండి తొలిసారి సుదీర్ఘ విరామం తీసుకున్న ఈ పేసర్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. దీంతో టీమిండియా బౌలింగ్‌ విభాగం మ‌రింత‌ బలంగా మారింది. నవ్‌దీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌ కూడా రాణిస్తే తిరుగుండదు.

Next Story