భారత్‌లో 68 లక్షల దాటిన కరోనా కేసులు
By సుభాష్ Published on 8 Oct 2020 12:23 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 78,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 68,35,656కి చేరింది. ఇక ఒకే రోజు దేశంలో 971 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు దేశంలో మరణాల సంఖ్య 1,05,526కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 83,011 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు మొత్తం 58,27,704 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో 9,02,425 కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
అలాగే దేశంలో రికవరి రేటు 85.25 శాతం ఉండగా, యాక్టివ్ కేసుల శాతం 13.20 శాతం ఉంది. దేశంలో మరణాల రేటు 1.54 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా గడిచిన24 గంటల్లో 11,94,321 కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య 8,34,65,975 ఉంది.
కాగా, కోవిడ్ పై దేశ ప్రజలు కలిసికట్టుగా పోరాడుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ పోరాటానికి కోవిడ్ యోధులు అదనపు బలం చేకూరుస్తున్నారని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటివి మర్చిపోవద్దని సూచించారు. కోవిడ్‌పై విజయం సాధిస్తామని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.