న్యూఢిల్లీ: దేశంలో జనవరి 30 నుంచి ఏ నెలలో ఎన్ని కరోనా కేసులు పెరిగాయంటే..!
By సుభాష్ Published on 17 July 2020 9:54 AM ISTదేశంలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు పది లక్షల చేరువలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా 25వేల దాటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి వరకు 10,00,202 పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. మరణాల సంఖ్య 25,553 ఉండగా, బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 32,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇక ఒక్క రోజులోనే 606 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు మూడింట ఒక వంతు ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. గరిష్టంగా ఒక రోజులోనే 20,783 మంది డిశ్చార్జ్ కావడంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,12,815 (63.25శాతం) కు చేరుకుంది. ఇక యాక్టివ్ కేసులు 3,31,146 (34.18శాతం) ఉన్నాయి. ఇక మహారాష్ట్ర, తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. కరోనా కట్టడివకి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకు ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, చాలా మంది మాస్క్ లు ధరించకపోవడం వల్ల కరోనా వ్యాప్తికి ముఖ్యకారణమని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌కు వ్యాక్సిన్ లేని కారణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తే తప్ప వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడమే సరైన మార్గమంటున్నారు.
జనవరి నుంచి జూలై వరకు పెరిగిన కరోనా కేసుల వివరాలు
కేసులు | పట్టిన సమయం | నమోదైన తేదీ |
తొలి కరోనా కేసు | ---- | జనవరి 30 |
1 లక్ష | 109 రోజులు | మే 19 |
2 లక్షలు | 14 రోజులు | జూన్ 3 |
3 లక్షలు | 10 రోజులు | జూన్ 13 |
4 లక్షలు | 8 రోజులు | జూన్ 21 |
5 లక్షలు | 6 రోజులు | జూన్ 27 |
6 లక్షలు | 5 రోజులు | జూలై 2 |
7 లక్షలు | 4 రోజులు | జూలై 6 |
8 లక్షలు | 4 రోజులు | జూలై 10 |
9 లక్షలు | 3 రోజులు | జూలై 13 |
10 లక్షలు | 3 రోజులు | జూలై 16 |