భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 4,987కేసులు.. 120మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 17 May 2020 10:18 AM ISTభారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,987 కేసులు నమోదు కాగా.. 120 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో ఒక రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,927 కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 2,872 మంది మృత్యువాత పడ్డారు. సగటున దేశంలో ప్రతి రోజు 3వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 34,109 మంది డిశ్చార్జి కాగా.. 53,946 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 30,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1135 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో 10,988 కేసులు నమోదు కాగా 625 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 4789 కరోనా కేసులు నమోదు కాగా 243 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా నివారణకు ప్రభుత్వం గత నెలన్నరగా లాక్‌డౌన్‌ను విధిస్తూ వస్తుంది. దీంతో ప్రపంచ దేశాల్లో కంటే భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య తక్కువగానే నమోదయ్యాయి. ఇటీవల కేంద్రం లాక్‌డౌన్ నిబంధనలు సడలించింది. దీంతో పలు రంగాలకు చెందిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. జనసంచారం పెరిగింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలింపుతో ఇతర ఆయా రాష్ట్రాల్లో ఇరుక్కుపోయినవారంతా తమ స్వస్థలాలకు చేరుతున్నారు. దీంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.