రష్యాలో కరోనా విలయతాండవం.. నిమిషానికి 8 మంది
By తోట వంశీ కుమార్ Published on 8 May 2020 4:54 AM GMTకరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. రష్యాలో అయితే ఈ మహమ్మారి విలయతాండవం ఆడుతోంది. గురువారం ఒక్క రోజే 11,231 కేసులు నమోదు అయ్యాయి. రష్యాలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,77,160కి చేరింది. ఒక్క మాస్కోలోనే 92,676 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే.. నిజానికి ఇది మూడు లక్షల వరకు ఉంటుందని మాస్కో మేయర్ సోబ్యానిన్ అంటున్నారు.
భారత్‌లో 24 గంటల్లో మరో 3,390 పాజిటివ్ కేసులు
ఇక భారత్‌లో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 103 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటి వరకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 56,342కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి ఇప్పటి వరకు 1,886 మంది మృతి చెందారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 16,539 కోలుకుని డిశ్చార్జి కాగా.. 37,916 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 17,974 కేసులు నమోదు కాగా.. గుజరాత్‌లొ 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409 కేసులు నమోదు అయ్యాయి.