గడిచిన 24 గంటల్లో కరోనా మరణాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానం
By సుభాష్
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 71వేలకు చేరుకోగా, గడిచిన 24 గంటల్లో 66,732 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదే విధంగా కొత్తగా 816 మంది మరణించగా, దేశంలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,09,150కి చేరుకున్నట్లు కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇక నేటి మరణాల్లో 84 శాతం పది రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి. కోవిడ్ మరణాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ గడిచిన 24 గంటల్లో 308 మంది కరోనాతో మరణించారు. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 71,20,539 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరలో 61,49,536 మంది కోలుకోగా, ప్రస్తుతం 8,61,853 కేసులు యాక్టీవ్‌లో ఉన్నాయి.
కరోనా వైరస్ కేసులు 21 రోజుల్లోనే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెరిగాయి.
30 లక్షలు దాటడానికి 16 రోజులు
40 లక్షలు దాటడానికి 13 రోజులు
50 లక్షలు దాటడానికి 11 రోజుల సమయం పట్టింది
ఇక ఈ కేసులు 12 రోజుల్లో 50లక్షల నుంచి 60 లక్షలకు పెరిగాయి. దేశంలో కరోనా కేసులు లక్షకు చేరుకోవడానికి 110 రోజుల సమయం పట్టింది. కానీ 10 లక్షలు దాటడానికి 59 రోజులు మాత్రమే పట్టడం గమనార్హం. అలాగే దేశ వ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు 1.54 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇక కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక రోజు తగ్గినా..మరుసటి రోజు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తోంది. వైరస్ వచ్చే వరకు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి పాటించాల్సిందే.