చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలిసారి న్యూజిలాండ్ గడ్డపై
By Newsmeter.Network Published on 2 Feb 2020 11:38 AM GMTకివీస్ గడ్డపై టీమిండియా అదరగొట్టింది. ఐదవ టీ20లో 7 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. దీంతో న్యూజిలాండ్ గడ్డపై తొలి సారీ సిరీస్ ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. మౌంట్‌మాంగనీ వేదికగా జరిగిన ఐదో టీ20లో భారత్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన కివీస్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కివీస్ బ్యాటింగ్‌లో సీఫెర్ట్(50; 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాస్ టేలర్(53; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేసినా మిగతా వారు విఫలం కావడంతో 7 పరుగుల తేడాతో ఆ జట్టు ఓటమి పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్-సంజూ శాంసన్‌లు ఆరంభించారు. సంజూ శాంసన్(2) మరోసారి విఫలమయ్యాడు. ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని అనవసరమైన షాట్‌కు నిష్క్రమించాడు. ఈ దశలో కేఎల్ రాహుల్(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు) కు జతకలిసిన రోహిత్ శర్మ(60 రిటైర్డ్ హర్ట్; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఈ జోడి రెండో వికెట్ కు 88 పరుగులు జత చేసింది.
ఆపై రోహిత్ శర్మ- శ్రేయస్ అయ్యర్(33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగించారు. రోహిత్ శర్మ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, రోహిత్ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు. కాలి కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు. దాంతో క్రీజ్‌లోకి వచ్చిన దూబే(5) నిరాశపరిచాడు. చివర్లో మనీష్ పాండే(11 నాటౌట్: 4 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో కుగ్‌లీన రెండు వికెట్లు సాధించగా, బెన్నెట్‌కు వికెట్ లభించింది..
భారత్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. గప్టిల్(2), మున్రో(15), టామ్ బ్రూస్(0)లు తక్కువ పరుగులకే ఔట్ కావడంతో 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాస్ టేలర్ రాస్ టేలర్(53; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), సీఫెర్ట్(50; 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఇన్నింగ్స్ ను తమ భుజాలపై వేసుకుని నడిపించారు. వీరిద్దరి ఆచితూచి ఆడుతూ.. భారత్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగి ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలోనే 30 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ సాధించగా, తన కెరీర్‌లో వందో టీ20 ఆడుతున్న టేలర్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 97 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ప్రధానంగా శివం దూబే వేసిన ఒక ఓవర్‌లో 34 పరుగులు జోడించడంతో కివీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. 10 ఓవర్ తొలి రెండు బంతుల్ని సీఫెర్ట్ సిక్స్‌లుగా మలచగా, మూడో బంతికి ఫోర్, నాల్గో బంతికి సింగిల్ తీశాడు. ఇక ఐదో బంతి నో బాల్ కాగా, దానికి ఫోర్ వచ్చింది. దాంతో ఎక్స్‌ట్రా పరుగు, బంతి కూడా వచ్చింది. దాంతో ఫ్రీ హిట్‌ను సిక్స్ కొట్టిన టేలర్.. ఆఖరి బంతికి కూడా సిక్స్ తో ముగింపు ఇచ్చాడు.
ఆ తర్వాత సీఫెర్ట్‌ను సైనీ పెవిలియన్‌కు పంపడంతో కివీస్ ఒత్తిడిలో పడింది. సీఫెర్ట్ అయిన కాసేపటికి డార్లీ మిచెల్ రనౌట్ అయ్యాడు. శాంసన్, రాహుల్‌ల అద్భుతమైన రనౌట్‌కు డార్లీ మిచెల్ వికెట్‌ను చేజార్చుకున్నాడు. చివరి ఓవర్‌లో ఇష్ సోధీ(16 నాటౌట్: 10 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు సాధించగా, సైనీ, శార్దూల్ ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్‌కు వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించగా.. సిరీస్ ఆద్యంతం బ్యాట్ తో అలరించిన కెఎల్ రాహుల్ కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.