ఉద్రిక్తత: భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

By సుభాష్  Published on  10 May 2020 11:48 AM GMT
ఉద్రిక్తత: భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

భారత్‌ - చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కింలోని నకూలా సెక్టార్‌ ప్రాంతంలో చైనా- భారత్‌ దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురి సైనికులకు గాయాలయ్యాయి. కాగా, కొంత సేపు తర్వాత రెండు దేశాల ఉన్నతాధికారుల చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.

సాధారణంగా భారత్ - పాకిస్థాన్‌ దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చైనా-భారత్‌ల మధ్య జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ఇలా రెండు దేశాల మధ్య సైనికులు ఘర్షణలకు దిగడం షాక్‌కు గురి చేస్తోంది. మొత్తం 150 మందికిపైగా సైనికులు ఒకరికొకరు ఘర్షణకు దిగనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. రోజువారీ గస్తీలో భాగంగా ఇరువైపులా వారు ఎదురుపడినప్పుడు ఈ ఘర్షణలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

ఇరు దేశాల సైన్యాలు నిర్ధేశిత మార్గదర్శకాల ప్రకారం చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించుకుంటాయని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, పాక్‌-భారత్‌ మధ్యనే ఎక్కువ ఘర్షణలు జరిగేవి. కానీ చైనాలో ఇలాంటి సమస్యలు తలెత్తడం తక్కువే కాగా, అప్పుడప్పుడు సరిహద్దుల్లో భారత్‌-చైనా దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

Next Story