రో'హిట్' అదుర్స్‌.. సూప‌ర్ ఓవ‌ర్ చివ‌ర్లో 6, 6 తో..

By Newsmeter.Network  Published on  29 Jan 2020 5:14 PM IST
రోహిట్ అదుర్స్‌.. సూప‌ర్ ఓవ‌ర్ చివ‌ర్లో 6, 6 తో..

హామిల్టన్ వేదికగా సెడాన్ పార్క్ లో టీమిండియా, న్యూజిలాండ్‌ కు మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌ లో రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌ తో టీమిండియా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో న్యూజిలాండ్ గడ్డపై భారత్ జట్టు తొలిసారి టీ20 సిరీస్‌ని గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా న్యూజిలాండ్‌ కూడా సరిగ్గా 6 వికెట్లకు 179 పరుగులు చేయడంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యం అయ్యింది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (27: 19 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రోహిత్ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు అర్థశతకాలు బాదిన రాహుల్ ఆచితూచి ఆడినా.. రోహిత్ మాత్రం టాప్‌గేర్‌లో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ 11వ ఓవర్‌లో ఔటవగా.. ఆ తర్వాత స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది. రోహిత్ శర్మ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (3) తేలిపోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (38: 27 బంతుల్లో 2×4, 1×6), శ్రేయాస్ అయ్యర్ (17: 16 బంతుల్లో 1×6) దూకుడుగా ఆడలేకపోయారు.

చివరి ఓవర్‌లో మనీశ్ పాండే (14 నాటౌట్: 6 బంతుల్లో 1×4, 1×6), రవీంద్ర జడేజా (10 నాటౌట్: 5 బంతుల్లో 1×6) చెరొక సిక్స్ బాది 18 పరుగులు రాబట్టడంతో భారత్ జట్టు 179 పరుగుల మెరుగైన స్కోరు చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్ మూడు వికెట్లు తీసుకోగా, గ్రాండ్‌హోమ్, సాట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.

టీమిండియా విసిరిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కివీస్‌ కు ఓపెనర్లు మార్టిన్‌ గుప్టిల్‌ (31: 21 బంతుల్లో 2×4, 3×6), మున్రో (14: 16 బంతుల్లో 2×4) 5.4 ఓవర్లలో 47 పరుగులు చేసి శుభారంభాన్ని ఇచ్చారు. ఈ జోడీని ఓవర్ వ్యవధిలో శార్ధూల్ ఠాకూర్, జడేజా పెవిలియన్ బాట పట్టించారు. అయినా భారత్ కు ఆనందం దక్కలేదు. వన్‌ డౌన్‌ బ్యాట్స్ మెన్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (95: 48 బంతుల్లో 8x4, 6x6) భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. చూస్తుండగానే భారత్‌కి మ్యాచ్ చేజారుతున్నట్లు అనిపించింది.

న్యూజిలాండ్ విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరంకాగా.. మహ్మద్ షమీ 8 పరుగులిచ్చి విలియమ్సన్, టేలర్‌ని ఔట్ చేశాడు. దీంతో కివీస్‌ కూడా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ను నిర్వహించారు.

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా..

సూపర్‌ ఓవర్‌ లో మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ కు బ్యాటింగ్‌ కు వచ్చింది. టీమిండియా తరుపున బుమ్రా బౌలింగ్‌ చేయగా విలియమ్‌సన్‌, గుప్టిల్ లు ఆడారు. మొదటి బంతికి విలియమ్‌ సన్‌ ఒక పరుగు తీయగా రెండవ బంతికి గుప్టిల్ ఒక పరుగు తీశాడు. బుమ్రా విసిరిన మూడో, నాల్గో బంతిని విలియమ్‌సన్‌ సిక్సర్‌, ఫోర్‌ గా మరిచాడు. ఐదో బంతికి విలియమ్‌ సన్‌ సింగిల్ తీయగా ఆరో బంతిని గుప్టిల్ బౌండరీకి తరలించాడు. దీంతో కివీస్‌ సూపర్‌ ఓవర్‌ లో వికెట్ నష్టపోకుండా వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.

సూపర్ ఓవర్ ఛేదనలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కి రాగా.. టిమ్ సౌథీ బౌలింగ్‌కి వచ్చాడు. దీంతో.. తొలి రెండు బంతులకీ రోహిత్ మూడు పరుగులే రాబట్టగా.. మూడో బంతికి ఫోర్ బాదిన రాహుల్.. నాలుగో బంతికి సింగిల్ తీశాడు. దీంతో చివరి రెండు బంతుల్లో భారత్ విజయానికి 10 పరుగులు అవసరం అయ్యాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ హిట్ మ్యాన్‌ రోహిత్ శర్మ అభిమానుల కంగారును పటా పంచలు చేస్తూ వరుసగా రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీంతో భారత విజయం సాధించింది.



Next Story