ఉగ్రవాదుల బంధువుల చేతుల్లో తిరంగా

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

By Medi Samrat  Published on  14 Aug 2023 5:29 PM IST
ఉగ్రవాదుల బంధువుల చేతుల్లో తిరంగా

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో కూడా తమ ఇళ్లపై భారత పతాకాన్ని ఉంచారు. ఉగ్రవాదుల బంధువులు, కుటుంబ సభ్యులు కూడా త్రివర్ణ పతాకాన్ని చేతుల్లోకి తీసుకోవడం విశేషం. హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది జావిద్ మట్టు సోదరుడు తన ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. రయీస్ మట్టు కశ్మీర్‌లోని సోపోర్‌లో నివసిస్తున్నాడు. రయీస్ మట్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో అతను ఇంటి బాల్కనీలో త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ కనిపించాడు.

రయీస్ మట్టూ మాట్లాడుతూ "నేను మ‌న‌స్ఫూర్తిగా తిరంగాను ఊపుతున్నాను. ఎవరి ఒత్తిడి లేదు. సారే జహాన్ సే అచ్ఛా హిందుస్థాన్ హమారా, హమ్ బల్బులే హై ఇస్కే యే గులిస్తాన్ హమారా. అభివృద్ధి ఉంది. ఆగస్ట్ 14న మొదటిసారిగా నేను నా షాప్‌లో కూర్చున్నాను. 2-3 రోజులు మూసి ఉండేది. గ‌తంలో రాజకీయ పార్టీలు ఆటాడుకున్నాయి. 2009లో మా అన్న ఉగ్రవాది అయ్యాడు. ఆ తర్వాత అతని గురించి మాకేమీ తెలియదు. బతికి ఉంటే తిరిగి రావాలని మనవి. పరిస్థితి మారిపోయింది. పాకిస్థాన్ ఏమీ చేయదని అన్నాడు.

ఫైసల్ అలియాస్ సాకిబ్ అలియాస్ ముసైబ్ గా పిలువబడే జావిద్ మట్టూ.. హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థలో క్రియాశీల ఉగ్రవాదిగా ఉన్నాడు. భద్రతా సంస్థల లిస్టులో ఇతను కూడా ఉన్నాడు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగ’ ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాని మోదీ ప్రజలను కోరగా అందులో ఉగ్రవాదుల కుటుంబాలు కూడా పాల్గొన్నాయి. మోదీ పిలుపు మేరకు ఆదివారం శ్రీనగర్‌లో మెగా 'తిరంగా' ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు.


Next Story