వికెట్ల పతనాన్ని అడ్డుకున్న వరుణుడు.. ముగిసిన తొలి రోజు ఆట
By Newsmeter.Network
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. టీ విరామం తరువాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో తొలి రోజు మిగిలిన ఆటను రద్దు చేశారు. ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా 55 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆట నష్టం జరిగింది.
అంతకముందు.. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న కివీస్ పేసర్లు భారత ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ లను ఇబ్బందులకు గురి చేశారు. 16 పరుగుల వద్ద పృథ్వీ షాను టిమ్ సౌథీ క్లీన్‌బౌల్డ్ చేయడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన నయావాల్ చటేశ్వర్ పుజార (11; 42 బంతుల్లో 1 ఫోర్) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఇక.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లి(2; 7 బంతుల్లో) ఇలా.. వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో 40 పరుగులకే 3వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.
ఈ దశలో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో జతకలిసిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే (122 బంతుల్లో 38 బ్యాటింగ్, 4 ఫోర్లు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 34పరుగులు చేసిన మయాంక్ జట్టు స్కోర్ 88 వద్ద బౌల్ట్ బౌలింగ్‌లో జేమిసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రహానే, అగర్వాల్ మధ్య 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తెలుగు కుర్రాడు హనుమ విహారి (7) కూడా విఫలమవ్వడంతో.. 101 పరుగులకే భారత్ సగం వికెట్లు కోల్పోయింది.
రహానేకు జతకలిసిన రిషబ్ పంత్ (37 బంతుల్లో 10 బ్యాటింగ్, 1 ఫోర్)తో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆట నిలిపివేసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో జేమిసన్ 3, బౌల్ట్ , సౌథీ చెరో వికెట్ తీశారు.