మహిళల టీ20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాను భారత్ అడ్డుకునేనా..?

By Newsmeter.Network  Published on  21 Feb 2020 7:28 AM GMT
మహిళల టీ20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాను భారత్ అడ్డుకునేనా..?

మహిళల టీ20 వరల్డ్ కప్ నేడు మొదలవబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడనుంది. బలమైన ఆస్ట్రేలియా జట్టును హర్మన్ ప్రీత్ సేన ఓడించడం అంత సులువైన విషయమేమీ కాదు.. కానీ ఇటీవల భారత జట్టు ఆస్ట్రేలియాను చాలా మ్యాచ్ లలో మట్టికరిపించింది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్-భారత్ ఆడిన ట్రై సిరీస్ లో భారత జట్టు ఫైనల్ కు చేరుకునే తరుణంలో ఆస్ట్రేలియాను సునాయాసంగా ఓడించేసింది. ఫైనల్ లో కూడా ఒకానొక సమయంలో భారతజట్టు విజయం దిశగా దూసుకు వెళ్ళింది. కానీ ఆఖరులో బోల్తా కొట్టింది. అందుకనే టీ 20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టును ఖంగు తినిపించాలని భారత్ భావిస్తోంది.

అదంత సులువైన పని కాదు.. మహిళల విభాగంలో ఇప్పటి వరకూ ఆరు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగగా.. అందులో నాలుగు సార్లు ఆస్ట్రేలియానే టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే భారత మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఆశించిన స్థాయి కంటే మెరుగ్గా ఆడాల్సి ఉంది. నాకౌట్ మ్యాచ్ లలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్లను ఓడించాలంటే స్మ్రితి మందాన లాంటి స్టార్ ఓపెనర్ కూడా అద్భుతంగా రాణించాల్సి ఉంటుంది. ముఖ్యమైన సమయంలో మిడిల్ ఆర్డర్ వైఫల్యం భారత్ ను ఇబ్బంది పెడుతోంది. వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్లలో అందరూ రాణిస్తే విజయం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

16 సంవత్సరాల షఫాలీ వర్మ అద్భుతమైన ఓపెనర్ గా పేరు తెచ్చుకుంటోంది. పవర్ ప్లే లో ఆమె పవర్ హిట్టింగ్ తో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్లకు షాకిచ్చింది. ఈ టోర్నమెంట్ లో ఆమె ఆటతీరు కూడా భారత్ విజయావకాశాలను నిర్ణయిస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గురించి..! ఆమె మిడిలార్డర్ లో ఆడిందంటే ప్రత్యర్థి జట్లకు బ్యాండ్ బాజానే.. కానీ ఆమె నిలకడలేమి ఆట తీరు భారత్ కు విజయాలను దూరం చేస్తోంది. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ రాణించడం కూడా చాలా ముఖ్యం. 16 సంవత్సరాల రిచా ఘోష్ కు తుది జట్టులో అవకాశాలు ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

బౌలింగ్ డిపార్ట్మెంట్ లో భారత్ ముఖ్యంగా స్పిన్నర్ల మీదనే ఆధారపడిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఫామ్ లో ఉన్న క్వాలిటీ పేసర్ లేకపోవడం కూడా భారత్ విజయావకాశాలను దెబ్బ తీస్తుంది. ఆస్ట్రేలియా లాంటి పిచ్ లపై పేసర్లు కూడా చాలా కీలకం. శిఖా పాండే ఒక్కతే రెగ్యులర్ పేస్ బౌలర్.. ఆమె ఆరంభంలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం.

ఈ మెగా టోర్నీలో మొదట్లోనే వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తానని శిఖా పాండే చెబుతోంది. మొదటి ఆరు ఓవర్లలోనే తాము సాద్యమైనన్ని వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తామని.. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి అన్నది ఉంటుందని చెప్పింది శిఖా పాండే. అలాగే డెత్ ఓవర్లలో కూడా సాధ్యమైనంత మంచి ప్రదర్శన ఇచ్చి తక్కువ పరుగులు ఇవ్వాలన్నదే తమ ముందున్న లక్ష్యం అని చెబుతోంది. 150 పరుగులు మహిళల టీ20ల్లో మంచి స్కోర్ అని.. మొదటి ఆరు ఓవర్లలో బ్యాటర్లు ఎక్కువ పరుగులు సాధించడానికి ప్రయత్నిస్తారని.. వారిని తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరిస్తే మ్యాచ్ మీద పట్టు సాధించవచ్చని చెబుతోంది శిఖా పాండే.

ఈ మెగా టోర్నమెంట్ లో సెమీస్ చేరే అన్ని అవకాశాలు ఉన్న జట్టుగా భారత్ ను అంచనా వేస్తున్నారు. హెడ్ కోచ్ డబ్యూ.వి.రామన్ భారత జట్టుకు టైటిల్ గెలిచే సత్తా ఉందని అంటున్నారు. 2018 టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత మహిళల జట్టులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని.. ఫిట్నెస్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించిందని అంటున్నారు. ఆస్ట్రేలియాలో ఇటీవల ముగిసిన ట్రై సిరీస్ కూడా భారత జట్టుకు బాగా హెల్ప్ అయిందని.. వరల్డ్ కప్ లో మంచి ఫలితాలు సాధించనున్నామని ఆయన అంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:30(భారతకాలమానం ప్రకారం)కు భారతజట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Next Story
Share it