చెలరేగిన కివీస్ బ్యాట్స్‌మెన్లు.. టీమిండియాకు భారీ టార్గెట్
By Newsmeter.Network Published on 24 Jan 2020 8:55 AM GMT
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్క్ లో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్స్ చెలరేగి ఆడి టీమిండియాకు భారీ టార్గెట్ ను నిర్ధేశించారు. ఆ జట్టు బాట్స్ మెన్స్ పోటీ పడి మరీ పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అది ఎంత పెద్ద తప్పు నిర్ణయంతో తెలియడానికి ఎంతో సేపు పట్టలేదు.
న్యూజిలాండ్ ఓపెనర్లు ఆది నుంచి దూకుడుగా ఆడుతూ టీమిండియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేశారు. మొదటి వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 19 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 30 పరుగులు చేశాడు. శివమ్ దూబే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ తో పెవిలియన్ బాట పట్టాడు. మరో ఓపెనర్ మున్రో మాత్రం 42 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 59 పరుగులు చేసి కివీస్ జట్టు స్కోర్‌లో తనదైన పాత్ర పోషించాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ పట్టడంతో మున్రో బ్యాటింగ్‌కు తెరపడింది.
కివీస్ కెప్టెన్ విలియమ్‌సన్ కూడా 26 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేసి రాణించాడు. చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కోహ్లీకి క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. డీ గ్రాండ్‌హోమ్ కివీస్ అభిమానులను నిరాశపరిచాడు. జడేజా బౌలింగ్‌లో ఆడిన రెండో బంతికి గ్రాండ్‌హోమ్ శివమ్ దూబేకు క్యాచ్‌గా చిక్కి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. చివర్లో టేలర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా, శార్దూల్ ఠాకూర్, జడేజా, చాహల్, శివమ్ దూబేలకు తలో వికెట్ దక్కింది.