ఆ కుట్రకు సూత్రధారి ఇమ్రాన్ ఖాన్..
By తోట వంశీ కుమార్ Published on 16 April 2020 5:09 PM GMTపాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు జావెద్ మియాందాద్‌ను జట్టు నుంచి తొలగించడం వెనుక కుట్ర ఉందని ఆదేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కుట్రకు సూతధారి పాకిస్థాన్ మాజీ ఆటగాడు, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని ఆరోపించాడు.
ఇమ్రాన్ ఖాన్ 1992లో ఆటకు వీడ్కోలు పలికాడు. అతని తరువాత అతనికి అనుకూలంగా ఉండే వసీం అక్రమ్ ను కెప్టెన్‌గా నియమించేలా పావులు కదిపాడు. వసీం కెప్టెన్ కాగానే 1993 నుంచి మియాందాద్‌ను జట్టు నుంచి ఉద్వాసన పలకడానికి కుట్ర జరిగింది. ఆ కుట్రలో తనను పావుగా వాడుకున్నారని బాసిత్ అలీ అన్నాడు.
వారి కుట్రలో భాగంగా నన్ను మియాందాద్‌తో పోల్చడం ప్రారంభించారు. అసలు నిజాయతీగా చెప్పాలంటే.. మియాందాద్‌తో ఆటలో నేను కనీసం ఒక్క శాతం కూడా ఆడలేదు. అప్పటి వరకు నాలుగో స్థానంలో బరిలోకి దిగే నన్ను.. మియాందాద్‌ను జట్టు నుంచి తప్పించాక ఆరో స్థానంలో ఆడించారు. అయితే.. నేను ఆ స్థానంలో విఫలం అవుతాననే విషయం వారికి తెలుసు. అయినప్పటికి నన్ను ఆ ప్లేస్‌లోనే ఆడించారు. దీంతో భారీ షాట్లు ఆడలేక.. నేను దారుణంగా విఫలమయ్యాను. నాలుగో స్థానంలో అద్భుతంగా రాణించిన నన్ను ఆరో స్థానంలో ఆడాలని కెప్టెన్ వసీం అక్రమ్ ఆదేశించాడు. ఇమ్రాన్ ఆదేశాల మేరకు నడుచుకునే అక్రమ్ ఇదంతా చేశాడు.
1996 ప్రపంచకప్ కు ముందుగా ప్రకటించిన పాకిస్థాన్ జట్టులో మియాందాద్ పేరు లేదు. "నేను వైదొలిగితేనే.. మియాందాద్ చాన్స్ వచ్చిందన్నాడు. ముందుగా ప్రకటించిన 1996 ప్రపంచకప్ పాకిస్తాన్ జట్టులో మియాందాద్ పేరు లేదు. 15 సభ్యులతో కూడిన టీమ్‌లో నేనొకడిని. కానీ మియాందాద్ ప్లేయర్ల దగ్గరకు వచ్చి అతనికి వరల్డ్‌కప్ ఆడాలనుందని విజ్ఞప్తి చేశాడు. అత్యధిక ప్రపంచకప్‌లు ఆడిన రికార్డు నమోదు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దాంతో మియాందాద్‌పై ఉన్న గౌరవంతో ఆ ప్లేస్‌ను త్యాగం చేశా" అని బాసిత్ అలీ పేర్కొన్నాడు.