60 రోజుల నిషేధంపై ట్రంప్ క్లారిటీ..!
By సుభాష్ Published on 22 April 2020 11:33 AM GMTఅమెరికాలో కరోనా వైరస్ కాలరాస్తోంది. ఈ నేపథ్యంలో వలస కార్మికులకు సంబంధించి జారీ చేసిన 60 రోజుల నిషేధంపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం గ్రీన్ కార్డు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాత్కాలికంగా తమ దేశంలోకి అడుగుపెట్టే వారికి కాదని స్పష్టం చేశారు. మా దేశంలో శాశ్వతంగా ఉండాలనుకునేవారికి ఈ నిషేధం వర్తిస్తుందని ట్రంప్ చెప్పారు.
60 రోజుల అనంతరం తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పరిశీలిస్తానని, ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. నా ఉత్తర్వుల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ముందుగా నిరుద్యోగులైన అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలన్నదే నా లక్ష్యం అని వెల్లడించారు. ఇక ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో హెచ్1బీ వీసా ఆశిస్తున్న వేలాది భారతీయుల్లో మళ్లీ ఆశలు చిగురించినట్లయింది.
వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే ట్రంప్ ఈ నిర్ణయం
అయితే కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి, ఆహారం సరఫరా చేస్తున్న విదేశీయులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు కల్పించవచ్చని వైట్ హౌస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. కరోనాను అదుపు చేయడంలో విఫలం అయ్యారని, దానిని కప్పిపుచ్చుకునేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా జారీ చేసే వీసాల సంఖ్య కూడా రానురాను తగ్గుతూ వస్తోంది. 2016లో ఒబామా అధ్యక్షుడు ఉన్న సమయంలో 6 లక్షల 17వేల వీసాలు జారీ చేయగా, గత ఏడాది 4 లక్షల 62 వీసాలు మాత్రమే జారీ అయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.