నాగారంలో దారుణం.. వృద్ధాశ్రమం పేరుతో..

By Newsmeter.Network  Published on  24 Jan 2020 8:37 AM GMT
నాగారంలో దారుణం.. వృద్ధాశ్రమం పేరుతో..

హైదరాబాద్‌ నగర శివారులోని నాగారం సమీపంలోని శిల్పానగర్ లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధాశ్రమం పేరుతో ఓ సంస్థ అక్రమంగా మానసిక పునరావాస కేంద్రాన్ని నడుపుతూ వృద్ధులను చిత్ర హింసలకు గురి చేసిన వైనం ఆలస్యంగా బయటకు వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు పునరావాస కేంద్రం పై దాడి చేశారు. వృద్ధులకు విముక్తి కల్పించి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం శిల్పనగర్‌ లో గత కొంత కాలంగా వృద్ధాశ్రమం పేరుతో ఓ సంస్థ అక్రమంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మానసికంగా బాగులేని వారని బాగుచేస్తాం అని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. చెప్పిన మాట వినకుంటే నరకం చూపించేవారు. శరీరంపై నిప్పుతో కాల్చేవారని బాధితులు ఆరోపించారు. పది నుంచి పదిహేను మంది ఉండాల్సిన గదిలో 50 మందిని నిర్భంధించేవారన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే గొలుసులతో కట్టేసి దారుణంగా హింసించే వారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారంతో పునరావాస కేంద్రం పై పోలీసులు దాడి చేసి వారికి విముక్తి కల్పించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

Next Story