రోహిత్‌శర్మ, ధోనికి చెరో 15కోట్ల నష్టం.. కోహ్లికి ఎంతంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2020 5:14 PM IST
రోహిత్‌శర్మ, ధోనికి చెరో 15కోట్ల నష్టం.. కోహ్లికి ఎంతంటే..?

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా ముప్పుతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)ను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేశారు. వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తుండడంతో ఏప్రిల్‌లో కూడా పరిస్థితులు మారే అవకావం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో జూలై-సెప్టెంబర్‌ మధ్య ఐపీఎల్‌-13వ సీజన్‌ ను నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే.. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్‌ రద్దు అయితే.. టీమిండియా క్రికెట్లర్లు భారీగా నష్టపోనున్నారు.

పెద్ద మొత్తంలో నష్టపోనున్న భారత క్రికెటర్లలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్‌ ధోని లు ఉండగా.. పాట్ కమిన్స్‌, బెన్‌స్టోక్స్‌ లాంటి విదేశీ క్రికెటర్లు కూడా భారీగా నష్టపోనున్నారు. .

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని ఐపీఎల్‌ ప్రారంభం నుంచి(2008) నుంచి చైన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. అప్పట్లో ధోనిని అత్యధిక మొత్తం చెల్లించి చెన్నై తీసుకుంది. అయితే.. మళ్లీ వేలంలోకి ధోని రాలేదు. కానీ ధోనికి సుమారు రూ.15కోట్ల మేర చెన్నై చెల్లిస్తోంది. దీంతో మహేంద్రుడుకి రూ.15కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక ఈ ఐపీఎల్‌ ధోనికి ఎంతో ముఖ్యం. టీమ్‌ఇండియాలో పునరాగమం చేయాలంటే ఈ ఐపీఎల్‌లో ధోని రాణించాల్సిందే. ఈ టోర్నీ రద్దైతే.. ధోనిని అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపుగా చూడలేం.

ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇప్పటి వరకు ఆ జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. అయినప్పటికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిపై చాలా ఆశలే పెట్టుకుంది. 2018లో ఐపీఎల్‌ వేలంకి ముందు అత్యధిక రిటెన్షన్‌ ధర(రూ.15కోట్లు) కంటే రూ.2కోట్లు ఎక్కువ వెచ్చించి మరీ అతన్ని సొంతం చేసుకుంది. రెండేళ్ల నుంచి కోహ్లీ రూ.17కోట్లు తీసుకుంటుంన్నాడు. ఒకవేళ టోర్నీ రద్దైతే.. అత్యధిక మొత్తం నష్టపోయే ఆటగాడు కోహ్లీనే కావొచ్చు.

ఐపీఎల్‌ చరిత్రలో నాలుగు సార్లు ముంబాయి ఇండియన్స్‌ని ఛాంపియన్‌గా నిలిపాడు హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ. 2011 నుంచి ముంబాయి ఇండియన్స్‌ తరుపున ఆడుతున్నాడు హిట్‌మ్యాన్. 2018 ఐపీఎల్‌ వేలం తర్వాత రూ.15కోట్లు తీసుకుంటున్న మూడో ఇండియన్‌ క్రికెటర్‌ శర్మ. ఈ టోర్నీ జరగకపోతే రోహిత్‌ రూ.15కోట్లు నష్టపోతాడు.

వీరు కాక టీమ్‌ఇండియా క్రికెటర్లలో సురేశ్‌ రైనా రూ.11కోట్లు, హార్థిక్‌ పాండ్యా రూ.11కోట్లు, మనీష్‌ పాండే రూ.11కోట్లు, కేఎల్‌ రాహుల్ రూ.11 కోట్లు నష్టపోనున్నారు. ఇక విదేశీ ఆటగాళ్లలో బెన్‌స్టోక్స్‌ రూ.12.5కోట్లు, డేవిడ్‌ వార్నర్‌ రూ.12కోట్లు, స్టీవ్‌స్మిత్ రూ.12కోట్లు, ఏబీ డివిలియర్స్‌ రూ.11 కోట్లు చొప్పున నష్టపోనున్నారు.

Next Story