కరోనా ఎఫెక్ట్.. స్వీయ నిర్బంధంలో కివీస్ క్రికెటర్లు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2020 10:26 AM GMT
కరోనా ఎఫెక్ట్.. స్వీయ నిర్బంధంలో కివీస్ క్రికెటర్లు..

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి 8వేల మందికి పైగా మృత్యువాత పడగా.. 2లక్షల మంది దీని భారీన పడ్డారు. కరోనా ముప్పుతో ఇప్పటికే చాలా క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది న్యూజిలాండ్‌ జట్టు. మొదటి వన్డే తరువాత కరోనా ముప్పు నేపథ్యంలో ఆ సిరీస్‌ను అర్థాంతరంగా రద్దు చేశారు. దీంతో కివీస్‌ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు.

అయితే.. స్వదేశానికి వెళ్లిన న్యూజిలాండ్ క్రికెటర్లు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. టీమ్‌లోని 15 మంది ఆటగాళ్లతో పాటు ఆ టూర్‌కి వెళ్లిన కోచ్, టీమ్ సహాయ సిబ్బంది కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు కివీస్ బోర్డు తెలిపింది. ఇప్పటికే భారత్ నుంచి స్వదేశానికి వెళ్లిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 169కి చేరుకుంది. ఎవరైనా విదేశాల నుంచి వస్తే తప్పనిసరిగా కనీసం 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని అన్ని దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశాయి. అంతేకాకుండా పర్యాటక వీసాల్ని కూడా రద్దు చేశాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం మార్చి 13 నుంచి ఏప్రిల్ 15 వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Next Story