భారత్ ఓపెనర్లను చూసి భయపడుతున్న ఆసీస్ బౌలర్.. ఎందుకంటే..?
By తోట వంశీ కుమార్
ఆస్ట్రేలియా వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. మార్చి 8వ తేదీ ఆదివారం జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్నాయి. ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్.. వర్షం కారణంగా రద్దుకావడంతో గ్రూప్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత్ ఫైనల్ కు చేరుకోగా.. దక్షిణాఫ్రికాపై ఆసీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 5 పరుగులతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది.
ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టు ఓపెనర్లు చూస్తే భయమేస్తోందని అంటోంది ఓ ఆసీస్ బౌలర్. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించింది ఆస్ట్రేలియా బౌలర్ మెగన్. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడింది. టీమ్‌ఇండియాతో తలపడడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదంది. ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా యువ సంచలనం షెఫాలీ వర్మ.. తన బౌలింగ్‌ను ఉతికి ఆరేయడాన్ని గుర్తు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన మెగన్‌కు భారత ఓపెనర్ నాలుగు బౌండరీలు బాది దడ పుట్టించింది. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్‌తో ఆడాలంటే నాకు నచ్చదు. ఓపెనర్లు ఇద్దరూ(స్మృతి మంధాన, షెపాలీ వర్మ).. నా పై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. పవర్ ప్లేలో వారిని ఆపడం కష్టం. వాళ్లకు పవర్ ప్లేలో బౌలింగ్ చేయాలని అనుకోవడం లేదు. ఇటీవల జరిగిన ట్రై సిరీస్‌లో షెపాలీ నా బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టింది. నా బౌలింగ్‌లో ఇప్పటి వరకూ ఎవరూ కూడా అలా బాదలేదు. ఫైనల్ కోసం అతృతగా ఎదురు చూస్తున్నా. వారిద్దరికి కట్టడి చేయడానికి మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. అయినప్పటికి పవర్ ప్లే నా బౌలింగ్‌ను వారిద్దరు అలవోకగా ఎదుర్కొంటారని అని చెప్పింది మెగన్.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టు నాలుగు సార్లు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. తొలి సారి ఈ పొట్టి కప్పు ఫైనల్‌లో భారత జట్టు ఆడనుంది. ఫైనల్‌లో గెలిచి ఐదోసారి కప్పును సాధించాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతుండగా.. ఆసీస్‌ను ఓడించి తొలి సారి కప్‌ను ముద్దాడాలని టీమ్‌ఇండియా తహతహలాడుతోంది.