ఫైనల్‌లో ఆడడానికి జడేజాకు నో పర్మిషన్‌..!

రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సౌరాష్ట్ర జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో సౌరాష్ట్ర తరుపున ఫైనల్‌లో భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ఆడడానికి అనుమతి ఇవ్వాలని సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎస్‌సీఏ) బీసీసీఐ(భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు) ను అభ్యర్థించింది. అయితే.. ఈ అభ్యర్థనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలి తిరస్కరించాడు. దేశానికి ఆడటమే తొలి ప్రాధాన్యత పాలసీ కింద రంజీ ట్రోఫీ ఫైనల్లో జడేజా ఆడడానికి అనుమతి ఇవ్వలేదు. దీనిపై సౌరాష్ట​ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జయదేవ్‌ షా అసహనం వ్యక్తం చేశారు.

రంజీ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగేటప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు అనేవి ఉండకూడదు. కనీసం రంజీ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లోనైనా స్టార్‌ ప్లేయర్లను ఆడించాలి. అప్పుడే రంజీలకు కూడా ఆదరణ ఉంటుంది. రంజీ ట్రోఫీ ఫైనల్‌ జరిగే సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌ ఉంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) జరిగేటప్పుడు ఏమైనా అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారా..? అది డబ్బును తెచ్చిపెడుతుంది కాబట్టి.. ఆ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించడం లేదన్నారు. స్టార్‌ ఆటగాళ్లు ఉన్నప్పుడే రంజీ ట్రోఫీ మరింత ఫేమస్‌ అవుతుందని.. కనీసం ఫైనల్స్‌లోనైనా స్టార్‌ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ జట్టు తరఫున ఆడటానికి జడేజాని కోరుతున్నామని, అదే సమయంలో మహ్మద్‌ షమీ బెంగాల్‌ తరఫున ఆడాలని కూడా తాము కోరుకుంటున్నామన్నారు.

రంజీ ఫైనల్‌ మ్యాచ్‌.. సౌరాష్ట్ర-బెంగాల్‌ జట్ల మధ్య మార్చి 9 నుంచి 13 వరకు రాజ్‌కోట్‌ వేదికగా జరుగనుంది. అదే సమయంలో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటించనుంది. దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. తొలి వన్డే మార్చి 12న ధర్మశాల వేదికగా జరగనుంది. జడేజా కీలక ఆటగాడు కాబట్టి అతనికి రంజీ ఫైనల్స్‌కు అనుమతి లభించలేదు. దీన్నే ప్రశ్నిస్తున్నారు ఎస్‌సీఏ అధ్యక్షుడు జయదేవ్‌ షా. ఆ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌ ఏమిటని బీసీసీఐని నిలదీశారు.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *